రేపటికల్లా ఎస్సారెస్పీ ఫుల్.. భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ​ప్రాజెక్టు జలకళ

రేపటికల్లా ఎస్సారెస్పీ ఫుల్..  భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ​ప్రాజెక్టు జలకళ

హైదరాబాద్/ భద్రాచలం, వెలుగు: నాసిక్​తో పాటు మంజీరా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్​ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ ఫ్లడ్​సీజన్​లోనే అత్యధికంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షన్నర క్యూసెక్కులకు పైగా వరద ఎస్సారెస్పీలోకి వచ్చింది. సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు తగ్గింది. శనివారం రాత్రి వరకే ప్రాజెక్టు మూడింట రెండు వంతులు నిండింది. ఇన్​ఫ్లో మరో రెండు రోజులు ఇదే స్థాయిలో ఉంటుందని ఇరిగేషన్​వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే సోమవారం మధ్యాహ్నమే ఎస్సారెస్పీ గేట్లు ఎత్తే అవకాశముంది. కేవలం రెండు రోజుల్లోనే శ్రీరాంసాగర్​లోకి 25 టీఎంసీల వరద వచ్చింది. కృష్ణా బేసిన్​లో ఆల్మట్టికి నిలకడగా వరద కొనసాగుతున్నది.

తుంగభద్ర ప్రవాహం కూడా పెరిగింది. దిగువ గోదావరి ఉరకలెత్తుతున్నది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, తుపాలకులగూడెం బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచి వరద పెరుగుతుండడంతో భద్రాచలం వద్ద గోదావరి నది 40.4 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి నుంచి రెండు లక్షలు, మేడిగడ్డ నుంచి 6.10 లక్షలు, సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం) నుంచి 8.79 లక్షల క్యూసెక్కుల వరదను నదిలోకి వదిలేస్తున్నారు. దవళేశ్వరం నుంచి రెండు రోజుల్లోనే 110  టీఎంసీలకు పైగా నీరు బంగాళాఖాతంలో కలిసింది. పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పెరిగింది. దీంతో గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కులకు పైగా నీటిని బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. 

గోదావరిలో మళ్లీ వరద ఉధృతి

గోదావరిలో మళ్లీ వరద ఉధృతి పెరుగుతున్నది. ఎగువన కడెం ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం బ్యారేజీల గేట్లు ఎత్తడంతో వరదంతా కిందికి వస్తున్నది. ఆదివారం ఉదయం కల్లా భద్రాచలం వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి (43 అడుగులు)కి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం టౌన్​లోని అశోక్​నగర్ కొత్త కాలనీలోని 29 కుటుంబాలను నన్నపునేని మోహన్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోత్ కవిత వరదలపై రివ్యూ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, ఎగువన పేరూరు వద్ద 43 అడుగులకు చేరిన గోదావరి వరద క్రమంగా తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో వరద ముప్పు లేనట్లేనని అధికారులు చెబుతున్నారు.