
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యామ్ కు వరద కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు అధికారులు. రేపు డ్యామ్ గేట్లు తెరుస్తామని చెప్పారు. ఏపీ మంత్రి అనిల్ యాదవ్ .. రేపు శ్రీశైలం గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదులుతారు.
ఇపుడు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3 లక్షల 59 వేల క్యూసెక్కుల పైగా వరద వస్తోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం డ్యామ్ కు ఇంత భారీ వరద రావడం గత 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అన్నారు అధికారులు. 2009 వరదల సమయంలో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు. ఇవాళ 3.5 లక్షలు దాటి 4 లక్షల క్యూసెక్కులకు వరద చేరుతుందని అంచనా వేస్తున్నారు. గంట గంటకు వేగంగా పెరుగుతున్న వరదతో నిండు కుండలా మారింది శ్రీశైలం డ్యామ్. క్రస్ట్ గేట్లను తాకి పైపైకి నీటి మట్టం పెరుగుతోంది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తితోపాటు కాలువలకు నీటి విడుదలను క్రమంగా పెంచుతున్నారు అధికారులు.
(ఉదయం 7 గంటల వరకు అందిన వివరాల ప్రకారం)
శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ఇప్పుడున్న నీటి మట్టం : 878.90 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.807 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ : 182.6050 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 3 లక్షల 58 వేల 974 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : గేట్ ల ద్వారా నిల్
శ్రీశైలం డ్యామ్ కు ఎగువన..
- కల్వకుర్తి పథకానికి: 800 క్యూసెక్కులు
- మాల్యాల వద్ద HNSS (హంద్రీనీవా)కు : 1351
- ముచ్ఛుమర్రి ఎత్తి పోతల పధకం నుండి కె. సి.కెనాల్ కు : 735 క్యూసెక్కులు
- పోతిరెడ్డిపాడు ద్వారా : 20000 క్యూసెక్కులు
- మొత్తం ఔట్ ఫ్లో: 96,866
- శ్రీశైలం డ్యామ్ నుంచి తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 42,378 క్యూసెక్కులు విడుదల
- AP పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 31,602 క్యూసెక్కులు విడుదల
ఈ సంవత్సరం వర్షాలు ప్రారంభమైన తర్వాత.. గత జులై 31 న శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం (ఇన్ ఫ్లో) మొదలైంది. జులై 31న శ్రీశైలం డ్యాం నీటిమట్టం 804.10అడుగులు. 31.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి మినహా తుంగభద్ర వైపు నుండి ఇంకా ఎలాంటి వరద ప్రవాహం మొదలు కాలేదు.