- ఆన్ అండ్ ఆఫ్ విధానం
తిమ్మాపూర్, వెలుగు : ఎస్సారెస్పీ నుంచి కాకతీయ నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి నీటి విడుదల కోసం స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... యాసంగి పంటకు నీరు అందించాలన్న ఉద్దేశంతోనే కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. మొత్తం 6,90,695 ఎకరాల ఆయకట్టుకు 45.175 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు.
అందులో భాగంగానే బుధవారం నుంచి మార్చి వరకు నీటి విడుదల కొనసాగిస్తామని చెప్పారు. ఎల్ఎండీ నుంచి మూడు జోన్ల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. 1వ జోన్‌లో కరీనగర్ నుంచి మానకొండూర్, హుజూరాబాద్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, వర్ధన్నపేట మండలాల్లోని 3,51,541 ఎకరాలకు.. 2వ జోన్ పరిధిలో వర్ధన్నపేట నుంచి పాలకుర్తి, డోర్నకల్, పాలేరు, మధిర, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ మండలాల్లో 3,39,154 ఎకరాలకు నీరందుతుందని ఎమ్మెల్యే వివరించారు.
ఆన్‌అండ్ ఆఫ్ విధానంలో ఆరు తడులకు 90 రోజుల పాటు నీటిని అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఇంజినీర్ పి.రమేశ్, కార్యనిర్వాహక ఇంజినీర్లు సదయ్య, సంజన, కిరణ్‌కుమార్, డీఈ శ్రీనివాస్, ఏఈ వంశీధర్, వెంకటేశ్, తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి, గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
