సమగ్ర శిక్ష అభియాన్‌‌‌‌ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాల్లేవ్

సమగ్ర శిక్ష అభియాన్‌‌‌‌ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాల్లేవ్
  • శాలరీల కోసం 18 వేల మంది ఉద్యోగుల ఎదురుచూపులు
  • నెల గడిచేందుకు అప్పులు చేసి, తిప్పలు పడుతున్నామని ఆవేదన
  • స్టేట్ ఆఫీసులో పనిచేసే వారికి మాత్రమే జీతాలివ్వడంపై అసంతృప్తి 

హైదరాబాద్, వెలుగు: గత సర్కారు నిర్వాకంతో సమగ్ర శిక్ష అభియాన్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ) ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు అందట్లేదు. నవంబర్‌‌‌‌‌‌‌‌, డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నెల జీతాలు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో.. కాంట్రాక్ట్‌‌‌‌, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌తో పాటు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. స్టేట్ ఆఫీసులో పనిచేసే వారికి మాత్రమే జీతాలు వేయడంపై కింది స్థాయి ఉద్యోగుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో దాదాపు 18 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

వారిలో స్కూల్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయిదాకా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీతాలు రానివారిలో జిల్లాల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు, సెక్టోరల్ ఆఫీసర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎంఐఎస్​ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, కేజీబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, మోడల్ స్కూల్ హాస్టల్ ఎంప్లాయీస్, సీఆర్పీలు, పార్ట్ టైమ్ ఇన్‌‌‌‌స్ట్రక్టర్లు, మెస్సెంజర్లు తదితరులు ఉన్నారు. 2 నెలల జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఈఎంఐలు సకాలంలో కట్టలేకపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.150 కోట్లు ఇవ్వాలె..

గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ఎస్ఎస్ఏకు దాదాపుగా రూ.150 కోట్లు పెండింగ్ పెట్టింది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రతి నెల రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల దాకా అవసరం పడుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడంతో, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. జీతాల కోసం ఎస్ఎస్ఏ అధికారులు ఫైనాన్స్ ఆఫీసర్లకు ప్రతిపాదనలు పంపించినా, వారి నుంచి స్పందన లేదు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని నెలనెలా జీతాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ఎస్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ ఏవీ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. 

స్టేట్ ఆఫీసోళ్లు జీతాలు తీసుకున్నరు..

సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేట్ ప్రాజెక్టు ఆఫీసులో పనిచేసే ఏఎస్పీడీ, ఆర్‌‌‌‌‌‌‌‌జేడీలతో పాటు స్టేట్ సెక్టోరల్ ఆఫీసర్లు, కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నెలనెలా జీతాలు తీసుకుంటున్నారు. కానీ, జిల్లాల్లో పనిచేసే వారికి మాత్రం జీతాలు ఇవ్వడం లేదు. తక్కువ బడ్జెట్ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్షలోని ఒక కేడర్‌‌‌‌‌‌‌‌కు జీతాలివ్వాలి గానీ, కేవలం స్టేట్ ఆఫీసులో పనిచేసే వారికి మాత్రం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.