డిగ్రీతో సెంట్రల్​ పోలీస్​ ఉద్యోగాలు

డిగ్రీతో సెంట్రల్​ పోలీస్​ ఉద్యోగాలు
  • 4,187 పోస్టులతో ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్​

డిగ్రీతో జాతీయ స్థాయిలో కీలకమైన పోలీస్​ కొలువు సొంతం చేసుకునేందుకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఢిల్లీ పోలీస్‌‌ విభాగంతో పాటు సెంట్రల్‌‌ ఆర్మ్‌‌డ్‌‌ పోలీస్‌‌ ఫోర్సెస్‌‌ (సీఏపీఎఫ్‌‌)లో మొత్తం 4,187 ఎస్‌‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్​ ప్రకటన రిలీజ్​ చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే గ్రూప్‌‌–బి(నాన్‌‌–గెజిటెడ్‌‌), గ్రూప్‌‌–సి హోదాల్లో కొలువు సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌‌ఎస్‌‌సీ నోటిఫికేషన్‌‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, ఎగ్జామ్​ ప్యాటర్న్, సిలబస్‌‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌‌ గైడెన్స్‌‌ తెలుసుకుందాం.. 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్​, సెంట్రల్ ఆర్మ్‌‌డ్‌‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌‌)లో సబ్-ఇన్‌‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024కు సంబంధించి నోటిఫికేషన్‌‌ ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌‌) బీఎస్‌‌ఎఫ్‌‌, సీఐఎస్‌‌ఎఫ్‌‌, సీఆర్‌‌పీఎఫ్‌‌, ఐటీబీపీ, ఎస్‌‌ఎస్‌‌బీలో సబ్-ఇన్‌‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 28వ తేదీలోగా ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​

ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌‌ ఎస్‌‌ఐ పోస్టులకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష(పేపర్‌‌–1), ఫిజికల్‌‌ స్టాండర్డ్‌‌ టెస్ట్‌‌/ఫిజికల్‌‌ ఎండ్యూరెన్స్‌‌ టెస్ట్, రాత పరీక్ష (పేపర్‌‌–2).

రాత పరీక్ష పేపర్‌‌–1 :  పేపర్‌‌–1 పరీక్ష మొత్తం 200 మార్కులకు నాలుగు విభాగాల్లో(జనరల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ అండ్‌‌ రీజనింగ్, జనరల్‌‌ నాలెడ్జ్‌‌ అండ్‌‌ జనరల్‌‌ అవేర్‌‌నెస్, క్వాంటిటేటివ్‌‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్‌‌ కాంప్రహెన్షన్‌‌) జరుగుతుంది. ఒక్కో విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌‌ విధానంలో ఆన్‌‌లైన్‌‌ టెస్ట్‌‌గా నిర్వహిస్తారు. నెగెటివ్‌‌ మార్కింగ్‌‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు తగ్గిస్తారు.

రెండో దశ.. ఫిజికల్‌‌ స్టాండర్డ్‌‌ టెస్ట్‌ ‌:  తొలిదశ రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌‌ మార్కులు సాధించిన వారికి రెండో దశలో ఫిజికల్‌‌ స్టాండర్డ్‌‌ టెస్ట్‌‌ ఉంటుంది. ఇందులో అర్హత సాధించేందుకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుష అభ్యర్థుల కనీస ఎత్తు 170 సెంటీ మీటర్లు ఉండాలి. అదే విధంగా ఛాతీ విస్తీర్ణం 80 సెంటీ మీటర్లు ఉండాలి(శ్వాస పీల్చినప్పుడు 85 సెంటీ మీటర్లకు విస్తరించాలి). మహిళా అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెంటీ మీటర్లు తప్పనిసరి ఉండాలి.

పేపర్‌‌–2 రాత పరీక్ష :  ఫిజికల్‌‌ ఈవెంట్స్‌‌లో అర్హత సాధించిన వారికి పేపర్‌‌–2 పేరుతో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందు­లో ఇంగ్లీష్‌‌ లాంగ్వేజ్‌‌ అండ్‌‌ కాంప్రహెన్షన్‌‌పై మొత్తం 200 ప్రశ్నలతో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తా­రు. ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్‌‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు రెండు గంటల సమయం కేటాయిస్తారు.

పేపర్​2తో జాబ్​ డిసైడ్ ​:  పేపర్‌‌–2 పరీక్షలోనూ మెరుగైన ప్రతిభ కనబరిచి తుది జాబితాలో నిలిస్తే.. ఎస్‌‌ఐ కొలువు ఖాయమైనట్లే! ఢిల్లీ పోలీస్‌‌ విభాగానికి ఎంపికైన వారికి గ్రూప్‌‌–సి హోదా, సీఏపీఎఫ్‌‌ దళాలకు ఎంపికైన వారికి గ్రూప్‌‌–బి(నాన్‌‌–గెజిటెడ్‌‌) హోదా కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న విభాగం ప్రాథామ్యతలు, వారు పొందిన మార్కులు ఆధారంగా ఆయా విభాగాలకు కేటాయిస్తారు.

సిలబస్​

ఇంగ్లీష్‌‌ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌ ‌:  ఈ విభాగంలో రాణించడానికి.. బేసిక్‌‌ గ్రామర్‌‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌‌–స్పెల్ట్‌‌ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్‌‌/ప్యాసివ్‌‌ వాయిస్, డైరెక్ట్‌‌ అండ్‌‌ ఇన్‌‌డైరెక్ట్‌‌ స్పీచ్, వన్‌‌ వర్డ్‌‌ సబ్‌‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్‌‌ కాంప్రహెన్షన్‌‌లను ప్రాక్టీస్‌‌ చేయాలి. బేసిక్‌‌ ఇంగ్లీష్‌‌ గ్రామర్‌‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లీష్‌‌ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి..అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగా క్రోడీకరించడానికి ప్రాక్టీస్​ చేయాలి.

ఫిజికల్‌‌ ఎండ్యూరెన్స్‌‌ టెస్ట్‌ ‌:  ఫిజికల్‌‌ ఈవెంట్స్‌‌లో రాణించడానికి.. అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్‌‌ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతిరోజు కనీసం రెండు గంటలు ఫిజికల్‌‌ ఎఫిషియన్సీ టెస్ట్‌‌లో పేర్కొన్న అంశాలపై శిక్షణ పొందాలి. ఈ ఫిజికల్‌‌ ప్రాక్టీస్‌‌ ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. ఇలా దరఖాస్తు సమయం నుంచే సన్నద్ధత పొందితే విజయావకాశాలు మెరుగవుతాయి. 

జనరల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ అండ్‌‌ రీజనింగ్‌‌ :  ఈ విభాగంలో రాణించేందుకు వెర్బల్, నాన్‌‌–వెర్బల్‌‌ రీజనింగ్‌‌ అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా స్పేస్‌‌ విజువలైజేషన్, సిమిలారిటీస్‌‌ అండ్‌‌ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్‌‌ సాల్వింగ్‌‌ అనాలిసిస్, విజువల్‌‌ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్‌‌ సిరీస్, కోడింగ్‌‌–డీకోడింగ్, నంబర్‌‌ అనాలజీ, ఫిగరల్‌‌ అనాలజీ, వర్డ్‌‌ బిల్డింగ్, వెన్‌‌ డయాగ్రమ్స్‌‌ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌‌ నాలెడ్జ్‌‌ అండ్‌‌ జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌ :  అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

క్వాంటిటేటివ్‌‌ ఆప్టిట్యూడ్‌ ‌: ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్‌‌ మ్యాథ్స్‌‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్‌‌ రూట్స్, యావరేజెస్, ప్రాఫిట్‌‌ అండ్‌‌ లాస్, ఆల్జీబ్రా, లీనియర్‌‌ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.

ఫిజికల్‌‌ ఎండ్యూరెన్స్‌‌ టెస్ట్‌‌

ఫిజికల్‌‌ స్టాండర్డ్‌‌ టెస్ట్‌‌లో నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్‌‌ ఎండ్యూరెన్స్‌‌ టెస్ట్‌‌(పీఈటీ) పేరుతో పలు ఈవెంట్స్‌‌లో పోటీ నిర్వహిస్తారు. 

రన్నింగ్​:  పురుషులు 100 మీటర్లు పరుగును 16 సెకన్లలో, మహిళా అభ్యర్థులు 18 సెకన్లలో పూర్తి చేయాలి. దీంతో పాటు పురుష అభ్యర్థులు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 6.5 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాలి.

లాంగ్‌‌ జంప్‌ ‌:  పురుష అభ్యర్థులు 3.65 మీటర్లు, మహిళా అభ్యర్థులకు 2.7 మీటర్ల దూరం దూకాలి.
హై జంప్‌‌: పురుష అభ్యర్థులకు 1.2 మీటర్ల ఎత్తు, మహిళలు 0.9 మీటర్ల ఎత్తు ఎగరాలి.

షాట్‌‌పుట్‌‌ :  పురుషులకు మాత్రమే ఈ ఈవెంట్‌‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు 16 ఎల్‌‌బీ (7.26 కిలో గ్రామ్‌‌ల)ను 4.5 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది.  లాంగ్‌‌ జంప్, హై జంప్, షాట్‌‌పుట్‌‌ ఈవెంట్లలో నిర్దేశిత లక్ష్యాలను కనీసం మూడు ప్రయత్నాల్లో పూర్తి చేయాలి.

ట్రైనింగ్​లో క్వాలిఫై కావాల్సిందే
 
నియామకాలు ఖరారు చేసుకుని శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఏడు ఫిజికల్‌‌ ఈవెంట్స్‌‌కు సంబంధించిన టెస్ట్‌‌లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. వెర్టికల్‌‌ బోర్డ్‌‌పై జంపింగ్, రోప్‌‌ జంపింగ్, టార్జాన్‌‌ స్వింగ్, హారిజంటల్‌‌ బోర్డ్‌‌పై జంపింగ్, పార్లెల్‌‌ రోప్, మంకీ క్రాల్, వెర్టికల్‌‌ రోప్‌‌ ఈ వెంట్స్‌‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అప్పుడే వారిని ఆయా దళాల్లో కొలువులకు పంపుతారు.

ప్రిపరేషన్ ప్లాన్​

ఎంపిక ప్రక్రియలో కీలకమైన రాత పరీక్షలకు అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధత సాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేపర్‌‌–1, పేపర్‌‌–2లలో కనీస అర్హత మార్కుల నిబంధన ఉంది. అన్‌‌ రిజర్వ్‌‌డ్‌‌ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌‌ కేటగిరీ అభ్యర్థులు 25శాతం మార్కు­లు, ఇతర రిజర్వ్‌‌డ్‌‌ కేటగిరీ అభ్యర్థులు 20శాతం మార్కు­లు పొందాల్సి ఉంటుం ది. అప్పుడే సదరు అభ్యర్థులను తదుపరి దశకు పరిగణనలోకి తీసుకుంటారు.

నోటిఫికేషన్​ 

ఖాళీలు :  మొత్తం 4,187 పోస్టుల్లో సెంట్రల్ ఆర్మ్‌‌డ్‌‌ పోలీస్ ఫోర్సెస్(బీఎస్‌‌ఎఫ్‌‌, సీఐఎస్‌‌ఎఫ్‌‌, సీఆర్‌‌పీఎఫ్‌‌, ఐటీబీపీ, ఎస్‌‌ఎస్‌‌బీ)లో సబ్-ఇన్‌‌స్పెక్టర్ (జీడీ): 4,001. ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు: 125, 
 

మహిళలు : 61 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

అర్హత :  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 

సెలెక్షన్​:  సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్‌‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్స్​:  అర్హులైన అభ్యర్థులు మార్చి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9, 10, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. వివరాలకు www.ssc.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.