- మేడ్చల్‌కు 24.. రంగారెడ్డికి 30, వికారాబాద్ జిల్లాకు 31 స్థానం
- 90 శాతంపైగా సాధించినా ‘ఫలితం’ వెనకే..
- ఎప్పటిలాగే సత్తా చాటిన అమ్మాయిలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: టెన్త్ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా తీవ్ర నిరాశకు గురి చేసింది. రాష్ట్ర రాజధాని అయి ఉండి.. అన్ని జిల్లాలను వెనక్కి నెట్టకుండా చిట్టచివరన నిలిచింది. ఇక వికారాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి ఇంచుమించు ఇంతే. వికారాబాద్31, రంగారెడ్డి 30 స్థానాలతో గతేడాది కంటే కాస్త ముందు స్థానాల్లో నిలిచాయి. మేడ్చల్మల్కాజిగిరి జిల్లా 24వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే పర్సంటేజీ పెరిగినా.. మిగతా జిల్లాలు ఇంకా ఎక్కువ శాతం సాధించడంతో చివరి స్థానాల్లోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేడ్చల్95.24, రంగారెడ్డి 92.96, వికారాబాద్ 91.25, హైదరాబాద్జిల్లా 89.23 శాతం పాస్ పర్సంటేజీ సాధించినా ‘ఫలితం’ లేకుండా పోయింది. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులే స్టేట్ టాపర్స్ గా నిలవడం విశేషం..
74 వేలకు 66 వేల మంది పాస్
హైదరాబాద్ జిల్లాలో 74, 099 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 66, 115 మంది పాసయ్యారు. బాయ్స్ 36,254 మంది రాయగా 31,524 మంది పాసయ్యారు. అలాగే, గర్ల్స్ లో 37,845 మంది ఎగ్జామ్రాయగా, 34,591 మంది ఉత్తీర్ణులయ్యారు. సర్కారు బడుల నుంచి 7,758 మంది పరీక్ష రాయగా, 6,551 మంది పాసయ్యారు. ప్రైవేటు స్కూళ్ల నుంచి 59,062 మంది ఎగ్జామ్ రాయగా 52,714 మంది ఉత్తీర్ణత సాధించారు.
బీసీ వెల్ఫేర్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ మైనార్టీలు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో విద్యార్థులు 90 శాతానికి పైగా ఉత్తీర్ణులయ్యారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్98.72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచాయి. మైనారిటీ రెసిడెన్షియల్స్కూడా 97.30 శాతం ఫలితాలను నమోదు చేశాయి. ప్రైవేట్ స్కూల్స్ 89.25 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 84.44 శాతం ఫలితాలు సాధించాయి.
రంగారెడ్డి.. లాస్ట్ ఇయర్ కంటే బెటర్
చేవెళ్ల : నిరుడు 31వ స్థానానికి పరిమితమైన రంగారెడ్డి జిల్లా ఈసారి ఒక్క స్థానం మెరుగు పరుచుకొని 30వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. 52,946 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 49,217 (92.96 శాతం) మంది పాసయ్యారు. ఎప్పటిలాగే ఈ జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. 25,335 మంది అమ్మాయిలు ఎగ్జామ్ రాస్తే 24,012(94.78 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్ 27,611 మందికి 25,205(91.29 శాతం) మంది పాసయ్యారు. 2025లో 51,671 మందికి 45,386 మంది పాసై 87.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి 92.96 శాతం తెచ్చుకుని రెండు స్థానాలను మెరుగుపర్చుకుంది.
వికారాబాద్.. రెండు స్థానాలు ముందుకు..
వికారాబాద్: గత సంవత్సరం వికారాబాద్33 స్థానంలో నిలవగా ఈసారి 31వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 13,482 మంది పరీక్షలు రాయగా, 12302 మంది పాసయ్యారు. పాస్ శాతం 91.25గా నమోదైంది. 6, 729 మంది బాలురు, 6,753 మంది బాలికలు ఎగ్జామ్స్ రాయగా.. . 5955 బాయ్స్, 6347 మంది గర్ల్స్ పాసయ్యారు.
మేడ్చల్ లో గర్ల్స్హవా
మేడ్చల్ జిల్లాలో 48,855 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయగా..46,531 మంది పాసయ్యారు. బాయ్స్ 25,393 మంది రాస్తే 23,955 మంది, గర్ల్స్ 23,462 మంది రాయగా 22,576 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 96. 22, బాయ్స్ పర్సంటేజీ 94.34 శాతం వచ్చింది. మొత్తంగా 24వ స్థానంతో సరిపెట్టుకున్నది
సత్తా చాటిన కమ్మదనం గురుకుల అమ్మాయిలు
షాద్ నగర్ : కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల అమ్మాయిలు 100 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారు. స్కూల్‌లో 80 మంది ఉండగా 80 మంది పాసై వారెవ్వా అనిపించారు. ఇందులో 43 మంది 10/10 జీపీఏ సాధించారు. జి. వైష్ణవి 570 మార్కులతో స్కూల్టాపర్గా నిలిచారు. కె. మహేశ్వరీ 564, టి. శ్వేత 560, బి. సౌజన్య 559, కె. శృతి 557, పి.వెన్నెల 556 మార్కులతో శభాష్అనిపించుకున్నారు. స్కూల్ప్రిన్సిపాల్శారద మాట్లాడుతూ టీచర్ల కృషి, విద్యార్థుల పట్టుదలతోనే 100 శాతం రిజల్ట్ వచ్చిందన్నారు. ప్రత్యేక తరగతులతో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించామని సంతోషం వ్యక్తం చేశారు.
సర్కారు బడి పిల్లలు సాధించారు..
హైదరాబాద్ జిల్లా జమీస్థాన్ పూర్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని గడ్డం దీక్షిత 587 మార్కులు సాధించింది. అలాగే, గన్ ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ స్కూల్ లో చదివిన లవేటి దిల్లేశ్వరీ 580 మార్కులతో సత్తా చాటింది. మైసారం ప్రభుత్వ గర్ల్స్ స్కూల్ కు చెందిన అయేషా ఫాతిమా 575 , షేక్ పేట ప్రభుత్వ హై స్కూల్ కు చెందిన బిట్వాడా అపర్ణ 573, ఎలసతి అమ్ములు 571, అమీర్ పేట ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్ ప్రజ్వల రాయ్ తేజ్ 571, శంకేశ్వర్ బజార్ లోని ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని వంకని సిరి 570, కుల్సుంపుర ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్ గుమ్మడి బీరప్ప 570, అమీర్ పేట ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్ నిమ్మశెట్టి భవాని 569, కుల్సుంపురా ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్ వేముల జయరాం 569 మార్కులు సాధించారు.

