
- గ్రామీణ ప్రాంత యువతకు ఇబ్బందిగా మారిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని
- డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం సెక్రటేరియెట్ను ముట్టడించారు.
- పాత పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్
బషీర్ బాగ్/హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత యువతకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం సెక్రటేరియెట్ను ముట్టడించారు. సెక్రటేరియెట్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పలువురిని అరెస్టు చేసి ముషీరాబాద్, దోమల్ గూడ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించి కేసులు నమోదు చేశారు.
అనంతరం సీఆర్పీసీ 41 సెక్షన్ కింద నోటీసులిచ్చి, విడుదల చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. జీవో నంబర్ 46ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియమాకాలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53% పోస్టులు భర్తీ చేయాలని జీవోలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 50% పైబడి పోస్టులు అక్కడ భర్తీ అయితే మిగిలిన జిల్లాల అభ్యర్థులు నష్టపోతారన్నారు.