V6 News

యురేనియం తవ్వకాల నిషేధంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

యురేనియం తవ్వకాల నిషేధంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ , పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

యురేనియం తవ్వకాలపై కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని .. రాష్ట్ర ప్రజలంతా ఇందుకు వ్యతిరేకంగా ఉన్నారని అసెంబ్లీలో కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల జీవనం, అస్తిత్వం నల్లమల అడవులతో ముడి పడి ఉన్నాయనీ… యురేనియం తవ్వకాలతో అది దెబ్బతింటుందని అన్నారు.

చర్చలో భాగంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు… నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై కేంద్రం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం మార్చుకోవాలని కోరారు. ఒకవేళ కేంద్రం అడుగు ముందుకు వేస్తే… మొత్తం తెలంగాణ అంతా ఒక్కటై ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

నల్లమలలోనే కాదు.. తెలంగాణలో ఎక్కడా యురేనియం తవ్వకాలు జరపొద్దనే ప్రతిపాదనకు ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో రెజల్యూషన్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాస్ అయింది.

బడ్జెట్ పద్దులపై సమాధానంలో భాగంగా.. ఆదివారం నాటి అసెంబ్లీ సెషన్ లో…. యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తీర్మానం చేద్దామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. భట్టి సూచనకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు ఇవ్వడంతో.. ఇవాళ్టి అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా పాస్ అయింది.