ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఈవో వికాస్ రాజ్

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఈవో వికాస్ రాజ్

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు, నామినేషన్ ప్రక్రియ తదితర విషయాల గురించి సీఈవో వికాస్ రాజు మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 14 నామినేషన్లకు తుది గడువు విధించామని, వచ్చే నెల 3న ఎన్నిక జరగనుందని, 6న ఫలితాలు వెలువడుతాయని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మునుగోడు నియోజవర్గంలో ఇప్పటి వరకు 2 లక్షల 34 వేల మంది ఓటర్లు ఉన్నారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఎలక్షన్ కోసం మొత్తం 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. సిబ్బంది, ఈవీఎంలు ఈ నెల 12 వరకు మునుగోడుకు చేరుకుంటాయని స్పష్టం చేశారు.

2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు 

ఈ ఎన్నిక కోసం మొత్తం 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏడు మండలాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నిక సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు 40 లిక్కర్ షాపులను సీజ్ చేశామని వెల్లడించారు. మునుగోడులో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం సరఫరా జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఈ ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పరిశీలకులు వస్తారని, నియోజకవర్గంలోని పరిస్థితులపై వారు మానిటరింగ్ చేస్తారని వికాస్ రాజ్ చెప్పారు.