
- బాధితులకు భరోసా ఇవ్వాలి
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు అసలైన కొలమానం
- నమ్మకమైన, గౌరవమైన పోలీసులున్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని పిలుపు
హైదరాబాద్, వెలుగు: పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకూ ప్రతి ఒక్కరూ బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇవ్వాలని ఆదేశించారు. సివిల్ వివాదాల్లో తలదూర్చినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించేలా పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులు, సీపీలు, జిల్లాల ఎస్‌పీలు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, నాన్ కేడర్ ఎస్పీలు సహా కీలక అధికారులకు ఈ మేరకు డీజీపీ తొమ్మిది అంశాలతో కూడిన లేఖను రాయగా.. అది తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రజల్లో విశ్వాసం పెంచాలి..
బాధితుల సమస్యలను విని, వారికి తగిన న్యాయం చేస్తేనే ప్రజల్లో పోలీసు శాఖ పట్ల విశ్వాసం పెరుగుతుందని డీజీపీ తన లేఖలో తెలిపారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు క్షేత్ర స్థాయిలో అంకితభావంతో డ్యూటీ చేయాలన్నారు. ఆపదలో ఆదుకునేవారిని ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు. అధికారం, బాధ్యత పొందినవారు నైతిక ప్రమాణాలను పాటించాలని, వారు అవినీతికి పాల్పడితే యూనిఫాం పవిత్రతనే దెబ్బతీసినట్టు అవుతుందన్నారు. ‘‘సివిల్ వివాదాలు కోర్టుల పరిధిలోకి వస్తాయి. పోలీస్ స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలపై సెటిల్మెంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని డీజీపీ హెచ్చరించారు. ‘‘నమోదు చేసే ప్రతి ఎఫ్ఐఆర్, ప్రతి బాధితుడి కాల్ కు స్పందన, కేసు దర్యాప్తు న్యాయంగా, సానుభూతితో, అత్యున్నత ప్రమాణాలను ప్రతిబింబించేలా ఉండాలి. మనమంతా కలిసి రాష్ట్రాన్ని న్యాయమైన, దృఢమైన, స్నేహపూర్వకమైన, ప్రొఫెషనల్ పోలీసింగ్ కు మోడల్ గా మారుద్దాం. ప్రజలు భయం లేకుండా నివసించే, వేగంగా న్యాయం పొందే, నమ్మకమైన, గౌరవమైన పోలీసులు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం. మన ప్రవర్తన యూనిఫామ్‌కు గౌరవాన్ని, ప్రభుత్వానికి ప్రతిష్టను, సమాజంలో శాంతిని పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు.
భయం, పక్షపాతం లేకుండా చట్టాలు అమలు చేయాలి
ప్రొఫెషనల్ పోలీసింగ్ అనేది మార్గదర్శక సూత్రం కావాలని లేఖలో డీజీపీ సూచించారు. న్యాయం, నిష్పాక్షికతతో వ్యవహరిస్తూ చట్టం ముందు అందరినీ సమానంగా చూడాలన్నారు. ‘‘భయం, పక్షపాతం లేకుండా చట్టాలను అమలు చేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టేది పోలీస్ సిబ్బంది. కానీ, అవినీతికి పాల్పడే కొందరు పోలీస్ శాఖకు అప్రతిష్ట తెస్తున్నారు. అవినీతికి పాల్పడి పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. పోలీస్ యూనిఫాం అంటే గౌరవం. బాధ్యత. ప్రజా, దేశ సేవకు ప్రతీక. అవినీతి అనేది ప్రజల నమ్మక ద్రోహానికి సంకేతంగా చెప్పవచ్చు. యూనిఫాం ధరించిన వ్యక్తి అవినీతికి పాల్పడితే, యూనిఫాం అసలు అర్థాన్ని చెరిపివేసినట్టే. ప్రజలు పోలీస్ శాఖపై ఉంచిన విశ్వాసాన్ని అది దెబ్బతీస్తుంది. మన ప్రవర్తన యూనిఫామ్‌కు గౌరవాన్ని, ప్రభుత్వానికి ప్రతిష్టను, సమాజంలో శాంతిని కల్పించేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని డీజీపీ పేర్కొన్నారు.