మున్సిపోల్స్‌‌‌‌కు రేపు (జనవరి 21న ) షెడ్యూల్?

మున్సిపోల్స్‌‌‌‌కు రేపు (జనవరి 21న ) షెడ్యూల్?
  • కేబినెట్​ ఆమోదంతో ఎన్నికల నిర్వహణకు స్టేట్​ఎలక్షన్​ కమిషన్​ ఏర్పాట్లు 
  •  కోడ్​ వచ్చే అవకాశం ఉండడంతో మున్సిపాలిటీల్లో జోరుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. పట్టణాల్లో ఇందిరమ్మ చీరెల పంపిణీ షురూ

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్​ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్​సిగ్నల్​ఇవ్వడంతో స్టేట్​ఎలక్షన్​ కమిషన్ (ఎస్‌‌‌‌ఈసీ) ​కసరత్తు ముమ్మరం చేసింది.  బుధవారం ఎన్నికల​షెడ్యూల్​ విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఇప్పటికే మేయర్లు, మున్సిపల్​ చైర్​పర్సన్లతోపాటు వార్డులవారీగా రిజర్వేషన్ల జాబితాలు ఎస్ఈసీ చేతికందాయి. అంతకుముందే ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను సైతం ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కూడా పూర్తిచేసింది.  ఎన్నికల్లో పోటీ చేయబోయే ఇండిపెండెంట్​ అభ్యర్థుల కోసం 75 గుర్తులను ప్రకటించింది.ఇక షెడ్యూల్​ రిలీజ్​ చేసి నామినేషన్ల స్వీకరణ, పోలింగ్​కౌంటింగ్​ తేదీలను ప్రకటించడమే మిగిలి ఉన్నది.  షెడ్యూల్​ రిలీజ్​ అయితే ఆ వెంటనే రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ వస్తుంది. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు  అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు స్పీడప్​ చేశారు.  

పట్టణాల్లో చీరెల పంపిణీ..

నల్గొండ కార్పొరేషన్‌‌‌‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భూపాలపల్లి మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్​ సోమవారం స్వయంసహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ  చీరెలతో పాటు వడ్డీలేని రుణాల చెక్కులను అందించారు. జీహెచ్ఎంసీతోపాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పంపిణీ చేసేందుకు సుమారు 35 లక్షల చీరెలకు సర్కారు ఆర్డర్​ ఇచ్చింది.  కానీ చీరెల తయారీ లేట్​ అవడంతో  మార్చి 1 నుంచి 8 మధ్య చీరెలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు తయారైన చీరెలను వీలైనన్ని మున్సిపాలిటీల్లో పంచాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.  ఎలక్షన్ ​కోడ్​ అమల్లోకి వస్తే చీరెల పంపిణీ సాధ్యం కాదని భావించే   సోమవారం నుంచి   శ్రీకారం చుట్టినట్లు సమాచారం.  రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల నుంచి 4 లక్షల చీరెలను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు మెప్మా ఆఫీసర్లు చెప్పారు.