కొత్త హౌసింగ్ పాలసీపై గృహనిర్మాణ శాఖ కసరత్తు
- ఈ నెలలో బిల్డర్లతో మీటింగ్
- పాలసీపై సలహాలు, సూచనలు స్వీకరణ
- అన్ని అనుమతులు ఇప్పించాలంటున్న బిల్డర్లు
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాలసీ ప్రకటించే చాన్స్
హైదరాబాద్, వెలుగు:పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలకే ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న అఫర్డబుల్ హౌసింగ్ పాలసీపై గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ పాలసీలో చేర్చాల్సిన అంశాలపై డ్రాఫ్ట్ ను రెడీ చేస్తున్నారు.
పాలసీని ఖరారు చేసే బాధ్యతను హౌసింగ్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ అనే అంతర్జాతీయ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. గత రెండు నెలల నుంచి పాలసీ ఖరారుపై పని చేస్తుండగా.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనున్నారు.
గత రెండు నెలల నుంచి కన్సల్టెన్సీ ప్రతినిధులతో హౌసింగ్ అధికారులు పలుమార్లు సమావేశమై పాలసీపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో హౌసింగ్ బోర్డు, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(దిల్) భూముల్లో టౌన్ షిప్ లు నిర్మించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు భూముల్లో ఈ టౌన్ షిప్ లను ప్రైవేట్ బిల్డర్లు నిర్మించనున్నారు. ఇందుకు జీహెచ్ఎంసీ, హౌసింగ్, డీటీసీపీ, హెచ్ఎండీఏ అధికారులతో గత ఏడాది కమిటీని ఏర్పాటు చేశారు.
బిల్డర్లతో మీటింగ్
హౌసింగ్ పాలసీ డ్రాఫ్ట్ తో పాటు ఇతర అంశాలపై అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సీబీఆర్ఈ సంస్థ పలుసార్లు సమావేశాలు నిర్వహించింది. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో సైతం రెండు, మూడు మీటింగ్ లు ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా ఈ నెలఖరులో హైదరాబాద్ లో బిల్డర్లు, హౌసింగ్ నిపుణులు, పట్టణీకరణ నిపుణులతో సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వారి సలహాలు, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాలసీని నిర్ణయించనున్నారు.
గ్రీన్ చానల్ ద్వారా అనుమతులివ్వాలి..
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమిట్ లో హౌసింగ్ పాలసీపై ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇందులో క్రెడాయ్ తో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీల యజమానులు అటెండ్ అయ్యారు. ఈ పాలసీలో టౌన్ షిప్ ల నిర్మాణంలో భాగంగా అన్ని అనుమతులు ప్రభుత్వమే గ్రీన్ చానల్ ద్వారా ఇప్పించాలని.. అప్పుడే తాము టౌన్ షిప్ లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి అనుమతులు చాలా ఆలస్యంగా వస్తాయని.. ఇలా అయితే టౌన్ షిప్ ల నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు ప్రాజెక్టు కాస్ట్ కూడా పెరుగుతుందని బిల్డర్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
బడ్జెట్ సమావేశాల్లో పాలసీ ప్రకటన?
మార్చిలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆఫర్డబుల్ హౌసింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించనున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పాలసీని ప్రభుత్వం అమలు చేయనుంది. ఓ వైపు రాష్ట్రంలో 3.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. ఇందులో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది.
త్వరలో అర్బన్ ఏరియాల్లో సైతం జీ ప్లస్ 3 ఫ్లోర్లలో ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం నిర్మించేందుకు నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో19 ఖాళీ ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 3 ఫ్లోర్లలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. వీటికి అదనంగా హౌసింగ్ పాలసీని తీసుకొచ్చి టౌన్ షిప్ లు కట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ శాఖ ఎల్ఐజీ, ఎంఐజీ టౌన్ షిప్ లను భారీ ఎత్తున నిర్మించింది. ఈ కాలనీల్లో లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు నివసిస్తున్నారు.
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తీసుకొస్తున్నది. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు, విస్తృతమవుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఈ పాలసీని తీసుకొస్తున్నం.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సుమారు 42 లక్షల ఇండ్లను నిర్మించగా, ఇప్పుడు సుమారు 3.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఇండ్లకు డిమాండ్, సరఫరా మధ్య భారీ అంతరం ఉంది. పట్టణ ప్రాంతాల అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ప్రభుత్వ, ప్రవేట్ భాగస్వామ్యంతో ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య పేద, మధ్య తరగతి ప్రజల కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ తరహాలో ఇండ్లను నిర్మించాలని ఆలోచిస్తున్నాం. ఐటీ కారిడార్లలో అందుబాటులో ఉండేలా రెంట్స్, అర్బన్ ఏరియాల్లో టౌన్ షిప్ లు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో కార్మికులకు ఇండ్ల నిర్మాణం వంటి ప్రణాళికలు ఉన్నాయి.
– పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ మంత్రి
