అందాల పాకాలలో..జంగల్‍ సఫారీ..రూ.2.74 కోట్లు కేటాయించిన రాష్ట్ర సర్కార్‍

అందాల పాకాలలో..జంగల్‍ సఫారీ..రూ.2.74 కోట్లు కేటాయించిన రాష్ట్ర సర్కార్‍
  • జంగల్‍ ట్రాక్‍ రెడీ.. నేడోరేపో రానున్న సఫారీ వెహికల్స్ 
  • టూరిజం హబ్‍గా తీర్చిదిద్దేలా అభివృద్ధి పనులు షురూ
  • బోటింగ్‍, కొత్త కాటేజీలు, ఇంటర్నల్‍ రోడ్స్, రెస్టారెంట్‍, బ్యాటరీ వెహికల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు పనుల్లో సిబ్బంది

వరంగల్‍/నర్సంపేట, వెలుగు: ఓరుగల్లు పర్యాటకరంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పాకాల సరస్సు పరిసరాల్లో జంగల్‍ సఫారీ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టారు. కొండల మధ్య అందాల సరస్సు, అభయారణ్యం, దేశవిదేశాలకు చెందిన పక్షులతో ఇప్పటికే పర్యాటకులను అలరిస్తున్న పాకాల ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్‍గా డెవలప్‍ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో పనులు నడుస్తున్నాయి. త్వరలోనే పాకాల బెస్ట్  టూరిజం స్పాట్‍గా కనువిందు చేయనుంది.

ప్రకృతికి కేరాఫ్‍గా పాకాల అభయారణ్యం 

హైదరాబాద్‍ నుంచి 200 కిలోమీటర్లు, ఉమ్మడి వరంగల్‍ సిటీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే పాకాల అభయారణ్యం ప్రకృతికి కేరాఫ్‍గా ఉంటుంది. అందమైన సరస్సు మధ్యలో చిలకలగుట్ట కనువిందు చేస్తోంది. పర్యాటకులు నడిచే ప్రాంతంలోనే మత్తడి, తుంగబంధం తూము నుంచి నిలబడి చూస్తే ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. కట్ట కింది వైపు గలగల పారే తూము నీటిలో చిన్నారులు జలకాలాడుతూ మైమరచిపోతారు. దేశవిదేశాలకు చెందిన పక్షుల కిలకిలరావాలతో వైవిధ్యభరితమైన వాతావరణం ఆవిష్కృతమవుతోంది. రాక్‍ గార్డెన్‍ సెల్ఫీ స్పాట్స్, పాకాల అందాలను ఫొటో, వీడియోల్లో బంధించేలా చెరువు లోపలి వైపు కట్టమీదుగా ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‍ ఫొటో షూట్‍కు అనువుగా ఉంది. పెళ్లిళ్లు, బర్త్ డేల ఫొటో షూట్లతో నిత్యం అలరిస్తోంది.

ఆదరణ ఉన్నా.. పట్టించుకోలే 

పాకాల టూరిజానికి పర్యాటకులు మొదటి నుంచి ఫిదా అవుతున్నారు. కాగా, గత ప్రభుత్వంలో చాలా వరకు నిరాదరణకు గురైంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది పర్యాటకులు చెరువులో బోటింగ్‍ చేయడానికి ఎక్కువగా ఉవ్విళ్లూరేవారు. బటర్‍ ఫ్లై పార్క్  పిల్లలను అలరించేది. కాగా, అధికారుల పట్టింపు లేకపోవడంతో బోటు షికారు సేవలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయో?  తెలియని పరిస్థితులుండేవి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు రాత్రి సమయాల్లో సేద దీరడానికి అనువైన ఫెసిలిటీస్‍ కల్పించలేదు. సరైన టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. తినడానికి అవసరమైన క్యాంటిన్‍ లేకపోవడం మైనస్‍గా ఉండేది. ఆపై బోట్లు రిపేర్‍ రావడంతో నిర్వాహకులు బోటు షికారు బంద్‍ చేశారు. సరైన సౌలతులు లేకపోవడంతో  పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు కొంత వెనకాడేవారు.

రూ.2.74 కోట్లతో.. నయా పాకాల 

రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజాన్ని డెవలప్  చేసేందుకు పాకాల ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఉమ్మడి వరంగల్‍ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రూ.2.74 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో మరిన్ని సౌలతులు కల్పించేందుకు పనులు మొదలుపెట్టారు. బోటింగ్‍ పడవలతో పాటు నైట్‍ స్టే చేయడానికి ఏసీ, నాన్‍ ఏసీ కాటేజీల నిర్మాణం, టాయిలెట్లు, జంగల్‍ సఫారీ కోసం అంతర్గత రోడ్ల నిర్మాణం, అభయారణ్యంలో సఫారీ కోసం ఎలక్ట్రిక్‍ వాహనాలు, క్యాంటిన్‍, రెస్టారెంట్‍, డ్రింకింగ్‍ వాటర్‍ ఫెసిలిటీ, పెద్ద సంఖ్యలో వచ్చి వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా మినీ హాల్‍, రాత్రి సమయాల్లో క్యాంప్‍ ఫైర్‍ కోసం పనులు చేపడుతున్నారు. ట్రెక్కింగ్‍ స్పాట్‍ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే రూపురేఖలు మారి నయా పాకాల అలరించనుంది.

టూరిజం వర్సెస్‍ ఫారెస్ట్  లొల్లికి చెక్‍..

పాకాల టూరిజం అభివృద్ధికి ప్రధానంగా రెండు శాఖల మధ్య కో ఆర్డినేషన్‍ లేకపోవడమే కారణమైంది. పాకాల అభయారణ్యం కావడంతో అటవీ శాఖ ఆధీనంలో ఉంది. అదే సమయంలో ఇక్కడి సేవలు టూరిజం శాఖ చేతిలో ఉండేవి. పర్యాటకులు రాత్రి సమయాల్లో విడిది చేసేందుకు గ్లాస్‍ కాటేజీలు, క్యాంటిన్‍, బోటింగ్‍ నిర్వహణ బాధ్యతలను టూరిజం శాఖ చూసేది. టూరిస్టులు తిరిగే ప్రాంతాలు అటవీ శాఖ పరిధిలో ఉండి సమన్వయం లోపించింది.

క్రమంగా కాటేజీలు పనికిరాకుండా పోయాయి, బోట్లు రిపేరుకొచ్చి పాకాల గొప్పదనం తగ్గేలా చేశాయి. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ చూస్తున్న కాటేజీలు, క్యాంటిన్లు, బోటింగ్‍ నిర్వహణ బాధ్యతలను ఫారెస్ట్  డిపార్టుమెంట్‍ పరిధిలోకి తీసుకువచ్చారు. అద్దాల కాటేజీలను తిరిగి వాడుకలోకి తీసుకువచ్చేలా కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. పలుచోట్ల సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. బోటింగ్‍ కోసం మరిన్ని పడవలు తీసుకురానున్నారు.  

త్వరలోనే అందుబాటులోకి జంగల్‍ సఫారీ.. 

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులను కనువిందు చేసేలా జంగల్‍ సఫారీ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే సఫారీ ట్రాక్‍ ఏర్పాటు చేశాం. త్వరలోనే వెహికల్స్ రానున్నాయి. రాత్రి కూడా గడపాలనుకునే టూరిస్టులకు అవసరమైన కాటేజీల నిర్మాణం, క్యాంటిన్లు, ఇతరత్రా సౌలతులు సమకూర్చుతున్నాం. – రవికిరణ్‍, రేంజ్‍ ఆఫీసర్‍