వెలుగు, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో శనివారం ప్రారంభించారు. ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయా ప్రభుత్వ స్కూల్స్, ఆస్పత్రులను సందర్శించి, పరిశుభ్రత పాటించాలని చెబుతూ క్లీనింగ్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా నల్లబెల్లిలో కలెక్టర్ సత్యశారద హెల్త్ క్యాంప్పను ప్రారంభించి, నందిగామ హైస్కూల్‌ను పరిశీలించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, సిరోలు, కురవి మండలాల్లో కలెక్టర్ స్నేహ శబరీశ్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఎంపీడీవో, తహసీల్దార్, మార్కెట్ పరిసరాలు, పీహెచ్‌సీలను పరిశీలించారు. భద్రాద్రికొత్తగూడెం ఐడీఓసీ ఆఫీస్‌లో కలెక్టర్ అంకిత్ కార్యక్రమ నిర్వహణపై రివ్యూ నిర్వహించి ఆఫీసర్లకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం సుజాతనగర్ లో ఆయన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
కాగా, ఎమ్మెల్యే కూనంనేని జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యటించి, వార్డుల్లో పేరుకుపోయిన మురుగు తొలగించే పనులను పరిశీలించారు. అనంతరం ఆయన కొనిజర్ల మండలంలో పర్యటించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి హైస్కూల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆఫీసర్లు, టీచర్లతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని హైస్కూల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బూజు దులిపారు. వైరా మండలం విప్పలమడకలో నిర్వహించిన సమీక్షలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దిశా నిర్దేశం చేశారు. భద్రచలం ఐటీడీఏలో అన్ని విభాగాల ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.
