మండలిలో గోదావరి వరదలపై షార్ట్‌‌ డిస్కషన్‌‌

మండలిలో గోదావరి వరదలపై షార్ట్‌‌ డిస్కషన్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశమవగానే ఇటీవల మరణించిన మాజీ సభ్యులు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డికి సంతాపం తెలుపుతారు. అనంతరం అసెంబ్లీని వాయిదా వేస్తారు. ఆ తర్వాత స్పీకర్‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి అధ్యక్షతన బిజినెస్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశమై అసెంబ్లీని ఎన్ని రోజులు నడపాలి, ఏయే అంశాలపై తీర్మానాలు చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. గోదావరి పరీవాహక ప్రాంతాన్ని ముంచెత్తిన వరదలపై కౌన్సిల్​లో షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌ నిర్వహిస్తారు. అనంతరం మండలిని వాయిదా వేస్తారు. ఆ తర్వాత చైర్మన్‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డి అధ్యక్షతన మండలి బీఏసీ సమావేశమవుతుంది. కౌన్సిల్​లో చర్చించాల్సిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. మార్చిలో నిర్వహించిన సమావేశాల్లో మండలి చైర్మన్‌‌‌‌ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యింది. అప్పుడే డిప్యూటీ చైర్మన్‌‌‌‌ ఎన్నికకు నోటిఫికేషన్‌‌‌‌ ఇవ్వాల్సి ఉండగా, మండలి చైర్మన్‌‌‌‌గా గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డి నియామకంపై గవర్నర్‌‌‌‌ గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయడం ఆలస్యమవడంతో అది సాధ్యం కాలేదు. ఈ సమావేశాల్లో డిప్యూటీ చైర్మన్‌‌‌‌ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. డిప్యూటీ చైర్మన్‌‌‌‌ ఎన్నిక షెడ్యూల్‌‌‌‌ను బీఏసీ సమావేశంలోనే ఖరారు చేస్తారని సమాచారం.

మూడు లేదా ఐదు రోజులు!

అసెంబ్లీ, మండలి సమావేశాలు 3రోజులు నిర్వహించే చాన్స్​ ఉందని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల నిర్వహించిన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌‌‌‌ ఇండికేషన్‌‌‌‌ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు పట్టుబడితే మరో 2రోజులు సభ నిర్వహించే చాన్స్​ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు మంగళవారంతో పాటు 12, 13 తేదీల్లో ఉభయ సభలు భేటీ కావాల్సి ఉంది. ఒకవేళ ఇంకో 2రోజులు సభ నడిపించాలని నిర్ణయిస్తే బుధవారంతోపాటు 14న సమావేశాలు కొనసాగే చాన్స్‌‌‌‌ ఉంది. ఈ నెల 16 నుంచి ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 15వ తేదీలోపే అసెంబ్లీ సెషన్‌‌‌‌ ముగించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్‌‌‌‌ వర్సిటీలు, మహిళా, ఫారెస్ట్‌‌‌‌ వర్సిటీల చట్ట సవరణ, మున్సిపల్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ సవరణ, ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌బీఎం చట్ట సవరణలు ప్రతిపాదించి ఆమోదించనున్నట్టు  తెలిసింది. రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు, తెలంగాణకు అప్పులు రాకుండా కేంద్రం అడ్డుతగులుతోందని పేర్కొంటూ షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌ చేపట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఇచ్చే అంశాల్లోనూ ఒకటి, రెండింటిపై చర్చించే అవకాశముందని సమాచారం.