ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడు .. నేడు బీజేపీ ఆఫీసులో రైతు దీక్ష: కిషన్ రెడ్డి

ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడు .. నేడు బీజేపీ ఆఫీసులో రైతు దీక్ష: కిషన్ రెడ్డి
  • మా మేనిఫెస్టోపై మాట్లాడే దమ్ము రేవంత్‌‌కు ఉందా

హైదరాబాద్, వెలుగు: తమ మేనిఫెస్టోపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్ రెడ్డి ఉందా అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్  విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్  ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. పెంచిన పింఛన్లను ఎప్పుడిస్తారని, అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం ఏమైందని నిలదీశారు. ఎంపీ అరవింద్, మీడియా ఇన్‌‌చార్జ్  ఎన్వీ సుభాష్, పార్టీ అధికార ప్రతినిధి రచనా రెడ్డితో కలిసి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో కిషన్  మాట్లాడారు. 

ఎన్నికల సమయంలో అప్పులు తీసుకోండని రైతులను రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి, ఇప్పటి వరకు రుణాలను మాఫీ చేయలేదు. రైతుల సమస్యల పరిష్కారానికి సోమవారం బీజేపీ ఆఫీస్‌‌లో రైతు దీక్ష చేస్తున్నాం. దేశంలో పెట్రోల్, డీజిల్  తగ్గించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్  ప్రభుత్వమే’’ అని కిషన్  వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్  కూడా ఎన్నో హామీలు ఇచ్చారని, ఒక సమయంలో తల నరుక్కుంటా అని, కుర్చీ వేసుకుని కూర్చుంటా అని ప్రగల్భాలు పలికారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఆయన కూడా రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. 

రైతులకు ఉచితంగా ఎరువులిస్తామని ఒక్క కేజీ కూడా ఇవ్వలేదన్నారు. ‘‘నిజాం షుగర్  ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు?  కేజీ టు పీజీ విద్య ఏమైంది?” అని కేసీఆర్‌‌పై కిషన్  ఫైర్  అయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌‌పై జరిగిన దాడిని కిషన్ రెడ్డి ఖండించారు. ఆ ఘటనపై దర్యాప్తు జరగాలని, దోషులకు శిక్ష పడాలన్నారు. మరో ఐదేండ్ల పాటు ప్రజలకు ఉచిత రేషన్  బియ్యం అందిస్తామన్నారు. తెల్ల రేషన్  కార్డులేని మధ్య తరగతికి చెందిన సీనియర్  సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్  కింద వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్ భారత్  డిజిటల్  క్యాలెండర్ ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.