టీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం

టీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ క్రీడలకు ఎనలేని ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని మంత్రి చెప్పారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న క్రాస్ బౌ షూటింగ్ క్రీడలను శనివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీడలకు సంబంధించిన లోగో, క్రాస్ బౌ షూటింగ్ గన్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్ ప్రోత్సాహంతో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. క్రీడా కారులకు ఆర్ధికంగా తోడ్పాటునిస్తున్నామన్న మంత్రి... ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెడల్స్ సాధించిన నిఖత్ జరీనా, ఈషా సింగ్ కు అవార్డులు, రివార్డులు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని మంత్రి చెప్పారు. క్రీడల వల్ల చదువు పాడవుతుందని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తుంటారన్న మంత్రి... అందులో ఏమాత్రం నిజంలేదన్నారు. చదువుతో పాటు క్రీడల వల్ల కూడా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.