కిలో ప్లాస్టిక్ ఇస్తే.. స్టీల్ బాక్స్ ఫ్రీ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎండ్రియాల్ లో వినూత్న కార్యక్రమం

కిలో ప్లాస్టిక్ ఇస్తే..  స్టీల్ బాక్స్ ఫ్రీ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎండ్రియాల్ లో వినూత్న కార్యక్రమం
  • ప్లాస్టిక్​ను నివారించడమే లక్ష్యంగా టిఫిన్​ బాక్సుల పంపిణీ
  • సేకరించిన ప్లాస్టిక్​ రీసైక్లింగ్​కు తరలింపు

కామారెడ్డి, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామపంచాయతీ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంతో పాటు పంట భూముల కాలుష్యాన్ని నివారించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 

ఈ పథకం ప్రకారం గ్రామస్తులు ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తే వారికి ఉచితంగా ఒక స్టీల్ టిఫిన్ బాక్స్ అందజేస్తున్నారు. మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 90 మంది ఒక్కొక్కరు ఒక కిలో చొప్పున ప్లాస్టిక్ వ్యర్థాలను అందజేయగా, వారికి 90 స్టీల్ బాక్స్‌‌లు పంపిణీ చేశారు.

ఆలోచన ఎందుకొచ్చిందంటే..

ఎండ్రియాల్ గ్రామంలో 430 కుటుంబాలు, సుమారు 1450 మంది జనాభా ఉంది. వ్యవసాయ గ్రామమైన ఇక్కడ గత ఏడాది కురిసిన భారీ వర్షాల సమయంలో డంపింగ్ యార్డులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షపు నీటితో పాటు పంట పొలాల్లోకి చేరాయి. భూమిలో కరిగిపోని ప్లాస్టిక్ వల్ల పంటలు, భూసారం దెబ్బతినడంతో పాటు నీటి వనరులు కలుషితమవుతాయని, ఇది మానవులతో పాటు పశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని గ్రామస్తులు గుర్తించారు. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు సమావేశమై ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో, పొలాల్లో ఉన్న ప్లాస్టిక్‌‌ను సేకరించి తీసుకొస్తే ప్రతి కిలోకు ఒక స్టీల్ బాక్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ బాక్స్‌‌ల ఖర్చును దుబాయిలో నివసిస్తున్న గ్రామ వాసి లింగారెడ్డి స్వచ్ఛందంగా భరిస్తున్నారు.

ప్లాస్టిక్​ రీసైక్లింగ్​ కేంద్రాలకు..

సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా చిన్నారులు వినియోగించే స్నాక్స్ ప్యాకెట్ల వంటి ప్లాస్టిక్ కవర్లను కూడా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పిల్లలు వాటిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంతో పాటు, ఐస్‌‌క్రీమ్ అమ్మకాలను కూడా నియంత్రించారు. 

నాణ్యత లేని ఐస్‌‌క్రీమ్ విక్రయాలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని భావించి గ్రామంలో ఐస్‌‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని కూడా పరిమితం చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి అభినందించారు. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా నిలుస్తోందని, ఇతర గ్రామాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని సూచించారు.

మంచి స్పందన వస్తోంది

ప్లాస్టిక్​ వస్తువుల సేకరణకు మంచి స్పందన వస్తోంది. నిరుడు కురిసిన వర్షాలకు పంట పొలాల్లో చేరిన ప్లాస్టిక్​ వస్తువులను గమనించి వీటిని కట్టడి చేయాలని అనుకున్నాం. పంచాయతీ పాలకవర్గంతో పాటు, స్థానికులం అంతా కలిసి ప్లాస్టిక్​ వస్తువుల సేకరణ చేపట్టాం. మా నిర్ణయానికి మద్దతుగా దాత లింగారెడ్డి స్టీల్​ బాక్సులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
– కె. నర్సింలు, సర్పంచ్​,  ఎండ్రియాల్​