- క్రూడాయిల్ 100 డాలర్లు దాటడంతో ఆందోళన
- ఒక్కరోజే రూ.8.5 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
- ఒక దశలో సెన్సెక్స్ 2,494, నిఫ్టీ 752 పాయింట్లు డౌన్
- చివరకు సెన్సెక్స్ 1,352, నిఫ్టీ 422 పాయింట్ల వద్ద క్లోజ్
- రూ.6,030 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్న ఎఫ్ఐఐలు
- రూపాయి 53 పైసలు క్షీణించి రూ.92.35 వద్ద ముగింపు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఆయిల్ ధరలు చుక్కలనంటడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం దాదాపు రెండు శాతం మేర నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ నిధులు వెళ్లిపోతుండడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బకొట్టాయి. రూపాయి విలువ పతనం కావడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. సెన్సెక్స్ 1,352.74 పాయింట్లు (1.71 శాతం) క్షీణించి 77,566.16 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 2,494.35 పాయింట్లు పడిపోయి 76,424.55 స్థాయికి చేరుకుంది. బీఎస్ఈలో మొత్తం 3,379 షేర్లు నష్టాల్లో ముగియగా, 972 షేర్లు లాభపడ్డాయి. 185 కంపెనీల షేర్ల ధరలు మారలేదు. నిఫ్టీ 422.40 పాయింట్లు (1.73 శాతం) నష్టపోయి 24,028.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్ సమయంలో 752.65 పాయింట్లు క్షీణించి 23,697.80 స్థాయిని తాకింది. స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు సుమారు రూ.8.5 లక్షల కోట్ల సంపద నష్టపోయారు. యుద్ధం తీవ్రం కావడంతో చమురు సరఫరాపై భయాలు పెరిగాయి. ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్ 5.23 శాతం నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచింది. మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు జరగడం వల్ల నష్టాలు కొంతమేర తగ్గాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీల లాభాల మార్జిన్ తగ్గుతుందనే అంచనాలతో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ కంపెనీల షేర్లు నష్టపోయాయి. ముడి చమురు పెయింట్స్ కంపెనీలకు కీలకం కావడంతో ఈ రంగంలోని షేర్లూ తగ్గాయి.
ఇతర ఇండెక్స్లకూ నష్టాలే
బీఎస్ఈ స్మాల్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.11 శాతం, మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.08 శాతం పడిపోయింది. లార్జ్ క్యాప్ సైతం రెండు శాతం వరకు పడింది. బీఎస్ఈ ప్రైవేట్ బ్యాంక్ సూచీ 4.50 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 3.92 శాతం, ఆటో 3.89 శాతం పడిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) రూ.6,030.38 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 5.96 శాతం, జపాన్ నిక్కీ 5.20 శాతం నష్టపోయాయి. షాంఘై, హాంగ్ కాంగ్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. యూరప్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చమురు ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ఇక నుంచి కూడా పెయింట్స్, సిమెంట్, ఏవియేషన్ రంగాలపై ఒత్తిడి ఉంటుందని భావిస్తున్నారు.
92 దాటిన రూపాయి
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సోమవారం 39 పైసలు క్షీణించి రూ.92.21 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. యుద్ధం, చమురు ధరలు భారీగా పెరగడం రూపాయి పతనానికి ప్రధాన కారణమయ్యాయి. గత శుక్రవారం రూపాయి విలువ రూ.91.82 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడ్ ధర 23 శాతం పెరిగి బ్యారెల్ కు 119 డాలర్లకు చేరింది. తర్వాత 102 డాలర్లకు తగ్గింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూపాయి రూ.92.22 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.92.15కు పెరిగినప్పటికీ చివరికి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే..
యుద్ధం మొదలైనప్పటి నుంచి నిఫ్టీ సుమారు ఐదున్నర శాతం నష్టపోయింది. మార్కెట్ ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీనికి సోమవారం 23,700 లెవెల్ దగ్గర సపోర్ట్ లభించగా, షార్ట్ టెర్మ్‌లో పుల్‌బ్యాక్ ర్యాలీ అంచనా వేయొచ్చని అన్నారు.
‘‘మొత్తం మార్కెట్ మూడ్ బేరిష్‌గా ఉంది. షార్ట్ టెర్మ్‌లో 24,200–24,300 వరకు నిఫ్టీ పుల్ బ్యాక్ అవ్వొచ్చు”అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు. ‘పెరిగినప్పుడు అమ్మే’ స్ట్రాటజీకి అవకాశం ఉంటుందని అన్నారు.
క్రూడాయిల్ ధరల పెరుగుదల తాత్కాలికమని వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ బెర్న్‌స్టీన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ గారే అన్నారు. యుద్ధం తీవ్రత తగ్గితే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. కానీ యుద్ధం మరింత విస్తరించి దీర్ఘకాలం కొనసాగితే భారత మార్కెట్లపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివరించారు.
అబాకస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఫౌండర్ సునీల్ సింఘానియా మాట్లాడుతూ, ‘‘క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. తద్వారా మార్కెట్ పడుతుందనే అంచనాకు రాలేం. యుద్ధం ఆగుతుందనే సంకేతాలు వచ్చేంత వరకు ఇన్వెస్టర్లు భయపడుతూనే ఉంటారు. ఆర్థిక వ్యవస్థ, కంపెనీల లాభాలు బలంగా ఉండడంతో, స్టాక్‌లు మరింత పడిపోతే కొనుగోలు చేయడం మంచిది”అని ఆయన వివరించారు.
‘‘ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే తగ్గింది. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది ” అని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ సీఐఓ రాహుల్ సింగ్ తెలిపారు.
