- సెన్సెక్స్ 829 పాయింట్లు డౌన్
- 99 డాలర్లకి చేరిన బ్రెంట్
- రూ.ఏడు వేల కోట్ల విలువైన షేర్లు అమ్మిన ఎఫ్‌ఐఐలు
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం తీవ్ర నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు మరో రూ.4.5 లక్షల కోట్లు నష్టపోయారు. వెస్ట్ ఆసియాలో సంక్షోభం మరింత పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ల బలహీనత, రూపాయి పతనం, విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐల) అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 829 పాయింట్లు (1.08శాతం) పడిపోయి 76,034.42 వద్ద ముగియగా, ఇంట్రాడేలో 992 పాయింట్లు (1.29శాతం) వరకు పతనమై 75,871.18కి చేరింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 227 పాయింట్లు (0.95శాతం) తగ్గి 23,639.15 వద్ద సెటిలయ్యింది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా 4.23శాతం నష్టంతో అతిపెద్ద లూజర్‌గా నిలిచింది. మారుతి, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ షేర్లు కూడా భారీగా పడ్డాయి. మరోవైపు ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ముగిశాయి.
బ్రెంట్ క్రూడ్ ధరలు 8 శాతం పెరిగి బ్యారెల్‌కు 99 డాలర్ల దగ్గర ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పి, జపాన్ నిక్కీ, షాంఘై ఎస్‌ఎస్‌ఈ, హాంకాంగ్ హాంగ్ సాంగ్ గురువారం నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి విలువ 24 పైసలు క్షీణించి 92.25 కి చేరింది. ఎఫ్‌ఐఐలు గురువారం నికరంగా రూ. 7,050 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
