ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య రాళ్ల దాడి

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య రాళ్ల దాడి

ఇబ్రహీంపట్నం, వెలుగు :  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ ర్యాలీ కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డి వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీ సులు సహా 50 మందికి పైగా గాయపడ్డారు. బస్సులు, కార్లు, ప్రచార రథాల అద్దాలు ధ్వంసమయ్యాయి. తర్వాత ఇబ్రహీంపట్నం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చెరోవైపు నినాదాలు చేసుకుంటూ..

ఇబ్రహీంపట్నం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు సాగర్ రహదారిపై డివైడర్‌‌‌‌‌‌‌‌కు చెరోవైపు ఒక కిలోమీటర్ పొడవుగా​కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు రెచ్చగొట్టేలా నినాదాలు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలో కొందరు చెప్పులు విసరడం, రాళ్లు రువ్వడంతో పరిస్థితి చేయిదాటింది. జెండా కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు స్పందించి, చెదరగొట్టే లోపే 50 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురు పోలీసులు కూడా ఉన్నారు. గాయపడిన వాళ్లు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరిస్థితిని సమీక్షించారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చౌహాన్ హెచ్చరించారు. మరోవైపు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్​రెడ్డి రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఓటమి భయంతోనే రాళ్లతో దాడి చేయించారని, ఆ దాడి చేయించిన వ్యక్తి నాలుగోసారి కూడా ఓడిపోతాడని మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు.