మీర్ పేట్ లో వీధి కుక్కల బీభత్సం... పదేండ్ల బాలుడిపై దాడి..

మీర్ పేట్ లో వీధి కుక్కల బీభత్సం... పదేండ్ల బాలుడిపై దాడి..
  • తలపై చర్మం పీకేయడంతో పరిస్థితి విషమం

ఓల్డ్​సిటీ, వెలుగు: మీర్​పేట్​లో ఓ పదేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి సెల్లార్ లో ఆడుకుంటుండగా, ఒక్కసారిగా10 కుక్కలు విరుచుకుపడడంతో బాలుడి పరిస్థితి విషమంగా మారింది. సిద్దిపేటకు చెందిన అద్విక్ (10) వేసవి సెలవుల కోసం మీర్​పేట్ టీచర్స్ కాలనీలోని తన పిన్ని ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి ఇంటి సెల్లార్​లో ఆడుకుంటుండగా, సుమారు 10 కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి విరుచుకుపడ్డాయి. 

కుక్కల దాడిలో అద్విక్ శరీరమంతా గాయాలయ్యాయి. తలపై చర్మాన్ని కూడా కుక్కలు పీకేయడంతో పరిస్థితి విషమంగా మారింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్​లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అవసరమైన కొన్ని మందులు అందుబాటులో లేకపోవడంతో, అత్యవసరంగా నారాయణగూడ నుంచి మందులు తెప్పించి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 

ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు నిరంతర పర్యవేక్షిస్తున్నారు. కాగా, సెలవుల్లో ఆనందంగా గడపడానికి వచ్చి ఆసుపత్రి పాలైన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.