వ్యాక్సిన్​పై తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు

వ్యాక్సిన్​పై తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్‌‌పై సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు సృష్టించొద్దని, షేర్​ చేయవద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. తప్పుడు పోస్టులు చేసేవారిపై డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ యాక్ట్‌‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వదంతుల కారణంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి హెల్త్ స్టాఫ్ వెనుకాడుతుండటం, రోజూ టార్గెట్‌‌లో యాభై శాతం కూడా రీచ్ కాకపోవడంపై హెల్త్​ డైరెక్టర్​ శుక్రవారం రివ్యూ చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్ల డాక్టర్లు, మేనేజ్‌‌మెంట్ల ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌‌ రాష్ట్ర ప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత డాక్టర్లతో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. వచ్చే నెల ఐదో తేదీ వరకూ హెల్త్ స్టాఫ్‌‌కు వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు. వ్యాక్సిన్లపై అపోహలు వద్దని, అందరూ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేసే హెల్త్ స్టాఫ్‌‌ 1.74 లక్షల మంది ఉంటే.. అందులో 1.10 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నార చెప్పారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.5 శాతం మంది, అత్యల్పంగా హైదరాబాద్‌‌లో జిల్లాలో 40.7 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు.

రాష్ట్రంలో మరో 197 కేసులు

రాష్ట్రంలో మరో 197 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో ఇద్దరు  చనిపోయారు. దేశవ్యాప్తంగా శుక్రవారం 18,855 కరోనా కేసులు నమోదయ్యాయని, 168 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.