కోల్ కతా సిటీ వణికిపోయింది. భయంతో జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. దీనికి కారణం భూకంపం.. అవును.. భారీ భూకంపం. కాకపోతే ఇది బంగ్లాదేశ్ దేశంలో వచ్చింది. బంగ్లాదేశ్ దేశంలో 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి.. సమీపంలో ఉన్న కోల్ కతా సిటీ మొత్తం ఊగిపోయింది.
ఇవాళ (21 శుక్రవారం) తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డికి నైరుతి దిశలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దింతో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, మాల్డా, కూచ్‌బెహార్, నాడియా, దక్షిణ దినాజ్‌పూర్, సిలిగురితో సహా చాలా ప్రాంతాలలో బలమైన భూప్రకంపనలు సంభవించాయి.
భూకంపం కారణంగా చాలా మంది ప్రజలు భయంతో ఇల్లులు, భవనాల నుండి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ఉదయం 4:38 గంటలకు సంభవించింది, భూకంపం కేవలం 10 కి.మీ లోతులో రావడం వలన ప్రకంపనలు భూమిపై చాలా బలంగా అనిపించాయి.
ప్రస్తుతానికి, ఎక్కడా కూడా ఆస్థి నష్టం లేదా ప్రజలకు గాయాలు అయినట్లు సమాచారం లేదు, కానీ అధికారులు పరిస్థితిని గమనిస్తున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం సంభవించడానికి ముందు శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా మోస్తరు భూకంపాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్లో తెల్లవారుజామున 1:59 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్తాన్లో తెల్లవారుజామున 3:09 గంటలకు 5.2 తీవ్రతతో బలమైన భూకంపం తాకింది. హిందూ మహాసముద్రంలో తెల్లవారుజామున 2:41 గంటలకు 4.3 తీవ్రతతో ఒక భూకంపం నమోదైంది.
భూకంపాలు ఎందుకు వస్తున్నాయి: భారత, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనే ప్రాంతంలో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఉంది, అందుకే ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తున్నాయి.ఈ నెల (నవంబర్ 2025) ప్రారంభంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఏడుగురు మరణించారు.
ఆగస్టు 2025లో కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చి, ఆ తర్వాత వచ్చిన భూప్రకంపనలతో కలిసి 2వేల మందికి పైగా మరణించారు. ఈ సంవత్సరం (2025) ప్రారంభంలో పాకిస్తాన్‌లో 5.5, 5.7, 5.0 తీవ్రతతో చాల భూకంపాలు సంభవించాయి.
