- ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న నూతన పీఆర్సీని ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మన్నెగూడలో ఎస్టీయూ రాష్ట్ర తృతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్సీని ప్రకటించాలన్నారు.
ఖాళీగా ఉన్న 600కు పైగా ఎంఈవో పోస్టులు, 80 డిప్యూటీ ఈవో కేడర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలీ వార్షిక నివేదికలు సమర్పించగా, కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.పర్వత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
