ఘట్కేసర్, వెలుగు: అయ్యప్ప మాలధారణలో ఎగ్జామ్స్ సెంటర్కు వెళ్లిన వ్యక్తిని స్వామి దుస్తులు తొలగించి సివిల్ డ్రెస్సులో కాలేజీ యాజమాన్యం అనుమతించింది. ఆ సంఘటన ఘట్కేసర్ మండలం నారపల్లి దివ్యానగర్లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన చందు నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
శుక్రవారం అయ్యప్ప మాల ధరించి కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చాడు. కాలేజీ స్టాఫ్ మాల దుస్తులు తీసి యూనిఫాం ధరించి రావాలని ఆదేశించారు. అయినా వినకపోవడంతో బలవంతంగా అయ్యప్ప మాల దుస్తులు తీయించి యూనిఫాం వేయించినట్లు బాధితుడు చందు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. రేపు కాలేజీ ఎదుట ఆందోళన చేస్తామని మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బండారి పవన్ రెడ్డి హెచ్చరించారు.
