టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆందోళన..కోదండరాం మద్దతు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆందోళన..కోదండరాం మద్దతు

టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై నిరుద్యోగులు రోడ్డెక్కారు.హైదరాబాద్ చిక్కడపల్లిలోని లైబ్రరీ దగ్గర ఆందోళనకు దిగారు. తిండి తిప్పలు మానేసి కష్టపడి చదివినా తమకు ఉద్యోగం రాలేదని..అలాంటి ప్రవీణ్ కు వందకు పైగా మార్కులు రావడమేంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పకడ్బందీగా ఉండే టీఎస్పీఎస్సీ ఆఫీసులో పెన్ డ్రైవ్ ద్వారా పేపర్ కాపీ చేయడం అంత ఆశామాషీ కాదని..ఇది సంస్థలో పనిచేసే ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైందని ఆరోపించారు. నిర్వహణ నిర్లక్ష్యంతోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపిస్తున్నారు. టీఎస్పీఎస్సీ  ఛైర్మన్ బి జనార్థన్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టీఎస్పీఎస్సీని యూపీఎస్సీకి అటాచ్ చేయాలన్నారు. 

గ్రూప్ 1 పై అనుమానాలు

గ్రూప్ 1 పేపర్ కూడా లీకైనట్లు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కూడా లీకేజీతోనే ఫెయిలయ్యామా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది. 2.86 లక్షల మంది గ్రూప్ 1 పరీక్ష రాయగా...1:50 నిష్పత్తిలో 25వేల 50 మంది క్వాలిఫై అయ్యారు. 

న్యాయం జరిగే వరకు పోరాడతాం..

నిరుద్యోగుల ఆందోళనకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు మాజీ ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళన న్యాయసమ్మతమైందన్నారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారం హేయమైందని చెప్పారు. దీనిపై విచారణ జరగాలన్నారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు నిరుద్యోగులంతా కలిసి పోరాడాలని సూచించారు.