- టెన్త్ స్టూడెంట్లకు స్టేట్ ‘గైడెన్స్’, పీఎం ‘వెబినార్’
- రేపు ఉదయం రాష్ట్ర, కేంద్ర విద్యాశాఖల కార్యక్రమాలు
- ఏది చూడాలో అర్థం కాక విద్యార్థుల అయోమయం
- టీ-సాట్ వర్సెస్ యూట్యూబ్ లైవ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లలో సోమవారం ఉదయం ఒకే సమయంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభంకానుండడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. టెన్త్ స్టూడెంట్ల కోసం రాష్ట్ర విద్యాశాఖ టీ-శాట్ ద్వారా మోటివేషన్ క్లాస్ నిర్వహించనుంది. సరిగ్గా అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ బడ్జెట్ వెబినార్ జరగనుంది. ఈ రెండు ప్రోగ్రామ్స్ కీలకమైనవి కావడంతో డిజిటల్ స్క్రీన్లపై ఏది టెలికాస్ట్ చేయాలో అర్థం కాక హెడ్మాస్టర్లు సతమతమవుతున్నారు.
టీ-సాట్‌లో గైడెన్స్ ప్రోగ్రామ్..
ఈనెల 14 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు టీ-శాట్‌లో గైడెన్స్ ప్రోగ్రామ్ చేపట్టనుంది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ విద్యార్థులకు పలు సూచనలు చేయనున్నారు. స్కూళ్లలోని ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ద్వారా విద్యార్థులందరూ దీన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
డిజిటల్ స్కిల్స్‌పై పీఎం వెబినార్..
సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు ‘సబ్కా సాత్..- సబ్కా వికాస్’ పేరుతో నిర్వహించే వెబినార్‌లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ గురించి ప్రధాని వివరించనున్నారు. పీఎంశ్రీ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. పేరెంట్స్ కూడా యూట్యూబ్ ద్వారా వీక్షించేలా ప్రోత్సహించాలని సూచించింది.
స్కూళ్లలో టెక్నికల్ సమస్యలు..
చాలా బడుల్లో ఒక డిజిటల్ స్క్రీన్ లేదా టీవీ మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవైపు టెన్త్ విద్యార్థులకు టీ-శాట్ ప్రోగ్రామ్, మరోవైపు పీఎం వెబినార్‌లో స్కూడెంట్లు పాల్గొన్నట్లు ఫీడ్‌బ్యాక్ పంపాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా పీఎంశ్రీ స్కూళ్లలో ఈ రెండింటినీ ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదని, ఒకే సమయంలో రెండు లైవ్ ప్రోగ్రామ్స్ ఉండడంతో హెడ్మాస్టర్లు, టీచర్లు తలలు పట్టుకుంటున్నారు.
