ఫుడ్ సరిగా పెడ్తలేరని విద్యార్థుల ఆందోళన

ఫుడ్ సరిగా పెడ్తలేరని విద్యార్థుల ఆందోళన

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలోని గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఆహారం సరిగా లేదని విద్యార్థులు ధర్నాకు దిగారు. మెనూ ప్రకారం ఫుడ్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అందించే ఆహారంలో అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. మంచి భోజనం అందించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. 

రీజినల్ కోఆర్డినేటర్కు ఫిర్యాదు
గిరిజన బాలికల కళాశాలలో ఆహారం సరిగా అందకపోవడంపై తాము సమావేశమయ్యామని విద్యార్థులు తెలిపారు. మెనూ ప్రకారం 100 శాతం ఫుడ్ పెట్టడం లేదన్నారు. ఇందుకోసమే తాము రీజినల్ కోఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వంద శాతం కాకున్నా..తమకు 90 శాతమైనా మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆర్సీవోను అడిగామన్నారు. ప్రస్తుతం మెనూలో కేవలం 50 శాతం మాత్రమే ఆహారం పొందుతున్నామని ఆర్సీవోకు చెప్పామన్నారు. 

ఆరోపణల్లో నిజం లేదు..
ఆహారం అందడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే..కాలేజీ సిబ్బంది మాత్రం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆహారం విషయంలో విద్యార్థులు ఆర్సీవోకు ఫిర్యాదు చేశారన్న మాటల్లో వాస్తవం లేదని ప్రిన్సిపాల్ శ్రీలత అన్నారు.