పుల్కల్, వెలుగు: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదువుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పుల్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు, కేజీబీవీ, నూతన ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీలో పారిశుధ్యం, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
