పోలీస్ అకాడమీ లో ఎస్.ఐ. ల పాసింగ్ అవుట్ పరేడ్

పోలీస్ అకాడమీ లో ఎస్.ఐ. ల పాసింగ్ అవుట్ పరేడ్

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్ పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. కొత్తగా ఎంపికై ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 12 వ బ్యాచ్  కు చెందిన 1162 మంది  ఎస్.ఐ లు పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. సివిల్ కు చెందిన 661 ఎస్.ఐ లు, ఐ.టీ, కమ్యూనికేషన్ కు చెందిన వారు 28 మంది, ఆర్.ఎస్.ఐ లు 448, ఫింగర్ ప్రింట్ కు చెందిన 25 ఏ.ఎస్.ఐలు ఉన్నారు. వీరిలో 256 మంది మహిళా ఎస్.ఐలు ఉన్నారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ట్రైనింగ్ పూర్తైన సబ్ ఇన్స్ పెక్టర్ల కుటుంబ సభ్యులు తరలివచ్చి పరేడ్ ను వీక్షించారు.  పరేడ్ లో పాల్గొన్న కొత్త ఎస్.ఐ లతో పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని… పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు. అవసరమైన నిధులన్నీ అందజేస్తున్నామని గుర్తు చేశారు. త్వరలోనే మరో 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దేశంలోనే అధునాతన రీతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మిస్తున్నామన్నారు. పోలీసులు తమ పరిధిలో నీతి నిబద్దతతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ నెంబర్-1 స్థానంలో ఉందన్నారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఎస్సైలు రావడం రాష్ట్ర పోలీసు శాఖ కి కొత్త బలం చేకూరిందన్నారు.  ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా, చట్ట ప్రకారం ప్రజలందరికీ రక్షణ కల్పించాలని సూచించారు. తాము పోలీస్ అవ్వగానే ఏదైనా చేయొచ్చనుకుంటారు.. కానీ ప్రజల రక్షణ కోసం మాత్రమే మీకు ఇచ్చిన అధికారాలను ఉపయోగించాలని కోరారు. సర్వీసులో ఉన్నంతకాలం ప్రజాలనుంచి ఏమీ ఆశించకుండా చట్టప్రకారం న్యాయం చేయాలన్నారు. పేద వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదన్నారు. ప్రతి ఒక్కరు టెక్నాలజీతో అప్డేట్ అవుతూ, టెక్నాలజీని ఉపయోగిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. మహిళ భద్రతలో తెలంగాణ దేశంలోనే ముందుంది… పోలీస్ శాఖ కి కావాల్సిన వనరులన్నీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోవది.. కాబట్టి ఎవరూ ఎలాంటి అవినీతికి పాల్పడవద్దు.. స్వంత ప్రయోజనాలకోసం ఎవరూ అధికారాన్ని వాడుకోవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.