కేఎంసీలో ఫస్ట్​ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ

కేఎంసీలో ఫస్ట్​ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ

 

  • ప్రైవేట్​ హాస్పిటల్​లో చేయిస్తే రూ. 6 లక్షల ఖర్చు  
  • విజయవంతంగా నిర్వహించిన ‘కాకతీయ’ డాక్టర్లు 
  • కోలుకుంటున్న పేషెంట్​

వరంగల్​సిటీ, వెలుగు : కాకతీయ మెడికల్ కాలేజ్ (కేఎంసీ) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​లో మంగళవారం మొట్టమొదటి సారిగా బ్రెయిన్​ట్యూమర్​ ఆపరేషన్​ను విజయవంతంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూప మెదడుకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. ప్రైవేట్​లో చూపించుకునే స్థోమత లేకపోవడంతో మార్చి11న కేఎంసీలోని న్యూరో సర్జరీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. ఆమెకు మెదడులో గడ్డ పెరగడంతో తీవ్రమైన తలనొప్పి, తల నుంచి కాళ్ల వరకు నొప్పితో విలవిల్లాడేది. ఫిట్స్​ కూడా వచ్చేవి.

పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ ​అవసరమని గుర్తించారు. ఈ ఆపరేషన్​కు ప్రైవేట్​లో సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. రిస్క్​ అయినా కూడా న్యూరో సర్జరీ విభాగం హెచ్ వోడీ డాక్టర్ మహమ్మద్ సికిందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, వీరేశ్, అనస్తీసియా డాక్టర్లు  డాక్టర్ మురళి, చంద్రశేఖర్, పీజీ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. స్వరూప ఇప్పడు కోలుకుంటోందని చెప్పారు. అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.