- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‌లో డంప్ యార్డు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్‌లో గుట్టలుగా చెత్త పేరుకు పోవడానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ అసమర్థ పాలన కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బుధవారం నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డంప్ యార్డు విషయంలో బండి సంజయ్ కరీంనగర్‌లో ఓ మాట, హుజూరాబాద్‌లో మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిరుడు జనవరి 24 న కేంద్ర మున్సిపల్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను తీసుకొచ్చి డంప్ యార్డ్‌ను తొలగిస్తామని హడావుడి చేసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.. కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు.
స్మార్ట్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వ సగం వాటాను దాచి కరీంనగర్ ను కేంద్రమే అభివృద్ధి చేస్తోందని అబద్ధాలు చెప్పారని, ఇప్పటికైనా ప్రజలకు భ్రమలు కల్పించడం మానుకోవాలన్నారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్, బీజేపీ నేతలు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కరీంనగర్‌లోని డంప్ యార్డులో వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సమావేశంలో తాజొద్దీన్, పిట్టల రవీందర్, కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.
