రైతుల పేరుతో షుగర్​ ఫ్యాక్టరీ లోన్లు.. 2,600 మంది పేరిట రూ. 19.96 కోట్ల రుణాలు

రైతుల పేరుతో షుగర్​ ఫ్యాక్టరీ లోన్లు.. 2,600 మంది పేరిట రూ. 19.96 కోట్ల రుణాలు
  • రైతులకు రుణమాఫీ మెసేజ్​లు రావడంతో బయటపడ్డ బండారం
  • కలెక్టర్​ ఆదేశాలతో ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు
  • ఆ డబ్బులు తామే చెల్లిస్తామంటున్న యాజమాన్యం

కామారెడ్డి / సదాశివనగర్, వెలుగు: ఓ షుగర్​ ఫ్యాక్టరీ రైతుల పేరిట వారికి తెలియ కుండా లోన్లు తీసుకున్నది. ఇటీవల తెలంగాణ సర్కారు లక్షలోపు రుణమాఫీ చేయగా, ఆ రైతుల సెల్​కు మెసేజ్​ వచ్చింది. దీంతో రైతులు అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. చివరకు బ్యాంకుకు వెళ్లి వాకబు చేయగా, అసలు విషయం బయటపడింది. దీంతో రైతులంతా మూకుమ్మడిగా వెళ్లి ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు.

 తమ పేరిట రుణాలు తీసుకొని, మోసం చేయడమేమిటని నిలదీశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డి,  నిజాంసాగర్​ మండలం మాగి శివారులో గాయత్రి యాజమాన్యానికి షుగర్  ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెరుకు ఫ్యాక్టరీకి పంపేందుకు యాజమాన్యం అగ్రిమెంట్​ చేసుకునే సమయంలో రైతులతో పలుపేపర్లపై సంతకాలు తీసుకున్నది.  

భూమి సర్వే నంబర్,  ఇతర వివరాలు సేకరించింది. ఈ వివరాలతో ఫ్యాక్టరీ, బ్యాంక్​, రైతుల పేరిట అగ్రిమెంట్​ జరిగినట్టు చూపించిన  యాజమాన్యం.. రైతుల పేర్ల మీద లోన్లు  తీసుకున్నది.  2023--–24  ఏడాదిలో  అడ్లూర్​ఎల్లారెడ్డి,  మాగీ ఫ్యాక్టరీ పరిధిలోని 2,600 మంది రైతుల పేరిట నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని నాందేవ్​వాడ యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​​ ఇండియా బ్రాంచ్​లో  ఫ్యాక్టరీ  రూ. 19.96 కోట్ల వరకు రుణాలు తీసుకున్నది. కొన్నేండ్లుగా ఫ్యాక్టరీ లోన్లు తీసుకుంటున్నప్పటికీ రైతులకు ఈ విషయం తెలియదు.  

ఇలా బయటపడింది..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.లక్ష లోపు ఉన్న  పంటరుణాలను మాఫీ చేసింది. రైతుల అకౌంట్లలో ఈ అమౌంట్​ను ప్రభుత్వం జమ చేసింది.  ప్రభుత్వం నుంచి రైతుల ఫోన్లకు రుణ మాఫీ జరిగినట్టు మెసేజ్​లు వచ్చాయి.    దీంతో రైతులు తమ పేరిట ఎవరు రుణం తీసుకున్నారనే అనుమానంతో  అగ్రికల్చర్, బ్యాంక్​ ఆఫీసర్లను  సంప్రదించారు.  కొందరు రైతులు బ్యాంక్​ శాఖకు వెళ్లి  విచారించగా, ​ ఫ్యాక్టరీ లోన్లు తీసుకున్న వ్యవహారం బయటకొచ్చింది.  బుధవారం  కొందరు మాజీ ప్రజాప్రతినిధులు జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​ను కలిసి, రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు.   

ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు

రైతుల పేరిట గాయత్రి షుగర్​ ఫ్యాక్టరీ యజమాన్యం  తీసుకున్న లోన్లు మాఫీ అయినట్టు రైతులకు మెసేజ్​లు  రావడంతో ఈ వ్యవహారం పై ఎంక్వైరీ చేయాలని రెవెన్యూ, అగ్రికల్చర్,  లీడ్​ బ్యాంక్​ ఆఫీసర్లను కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆదేశించారు.  దీంతో కామారెడ్డి ఆర్డీవో రఘునాథ్​రావు,  జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​ భాగ్యలక్ష్మి.. అడ్లూర్​ ఎల్లారెడ్డిలోని గాయత్రి  షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లారు.  రైతుల పేరిట తీసుకున్న  లోన్ల వివరాలు సేకరించారు.  

బైబ్యాక్​అగ్రిమెంట్ల మేరకు  లోన్లు తీసుకుంటున్నామని,  ఆ అమౌంట్ ను తామే బ్యాంకులకు చెల్లిస్తున్నామని ఫ్యాక్టరీ ప్రతినిధులు ఆఫీసర్లతో చెప్పినట్టు సమాచారం.  కాగా,  అడ్లూర్​ ఎల్లారెడ్డి పరిధిలో    రూ. 1. 23 కోట్లు,  మాగి పరిధిలో  రూ. 27 లక్షల అమౌంట్ రుణమాఫీ అయినట్టు అధికారులు గుర్తించారు.  బ్యాంక్​ శాఖ నుంచి రైతుల అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నారు.  అనంతరం వివరాలను కలెక్టర్​కు అందజేశారు.  ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత కలెక్టర్​కు పూర్తి రిపోర్టు అందజేయనున్నారు. 

ఆ లోన్లుమేమే చెల్లిస్తాం

రైతుల పేరిట బైబ్యాక్​అగ్రిమెంట్ల ఆధారంగా బ్యాంక్​లో లోన్లు తీసుకున్నట్టు  గాయత్రి షుగర్​ ఫ్యాక్టరీ వైస్​ ప్రెసిడెంట్​వేణుగోపాల్​రావు పేర్కొన్నారు. బుధవారం ఫ్యాక్టరీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  సీడ్, ఎరువులు,  లేబర్​ చెల్లింపుల కోసం  2003- -–04 నుంచి ప్రతి ఏడాది ఈ లోన్లు తీసుకుంటున్నామని,  ప్రతి సారి అమౌంట్ మళ్లీ తామే బ్యాంక్​కు చెల్లిస్తున్నామని చెప్పారు. ఈసారి ఆధార్​ కార్డును అనుసంధానం  చేయడం, లోన్లు  మాఫీ కావడంతో  రైతులకు మెసేజ్​లు వెళ్లాయని వివరించారు. లోన్ల గురించి రైతులు ఆందోళన చెందొద్దని చెప్పారు.   కొంత అమౌంట్ ఇప్పటికే  బ్యాంక్​లో జమ చేశామని తెలిపారు. 
- ఫ్యాక్టరీ వైస్​ ప్రెసిడెంట్​ వేణుగోపాల్​రావు


నేను ఏ బ్యాంక్​లో లోన్​ తీసుకోలే

ఏ బ్యాంక్​ శాఖలో నేను లోన్​ తీసుకోలేదు.   నిజామాబాద్​  నాందేవ్​వాడలోని యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ​  ఇండియాలో  తీసుకున్న లోన్​ అమౌంట్ రూ. 20, 391 మాఫీ అయినట్టు నా ఫోన్​కు మెసేజ్​వచ్చింది.  వెంటనే బ్యాంకుకు పొయ్యి వివరాలు కనుక్కున్న.   ఫ్యాక్టరీ వాళ్లు తీసుకున్నట్టు తెలిసింది.  ఫ్యాక్టరీ వాళ్లను అడిగితే.. తీసుకున్నామని చెప్పిన్రు.  నాకు తెలియకుండానే  నా పేరిట లోన్​ ఎట్లా ఇస్తరు?
–బలగం వెంకట్రాములు, రైతు, పోశానిపేట

లోన్​ విషయం చెప్పలేదు

సీజన్​లో మాతోని ఫ్యాక్టరీ వాళ్లు అగ్రిమెంట్​ చేసుకుంటరు. ఎరువులు ఇచ్చేటప్పుడు సంతకాలు తీసుకుంటే పెడతాం.  మా పేరిట లోన్​ తీసుకుంటమని ఫ్యాక్టరీ వాళ్లు ఎప్పుడూ చెప్పలేదు. రూ. 23, 666 లోన్​ ఉన్నట్టు మెసేజ్​ వచ్చింది. 
–అశోక్​, రైతు , పోశానిపేట