
చండ్రుగొండ, వెలుగు: ప్రేమించిన యువతితో పెండ్లి జరగదని తెలిసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన షేక్ ఆరీఫ్(22), అదే గ్రామానికి చెందిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. తన కూతురిని ఇచ్చి పెండ్లి చేసేది లేదని ఆమె తండ్రి ఆరీఫ్తో చెప్పాడు. దాంతో మనస్థాపానికి గురైన ఆరీఫ్ శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కు, అక్కడి నుంచి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ స్వప్నకుమారి తెలిపారు.