ఇద్దరు యువ రైతులు పాణం తీస్కున్నరు

ఇద్దరు యువ రైతులు పాణం తీస్కున్నరు
  • పంట దిగుబడి రాలేదని ఒకరు.. అప్పుల బాధతో మరొకరు
  • పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దారుణం

ముత్తారం / మొగుళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. పంట దిగుబడి సరిగ్గా రాలేదని ఒకరు, అప్పుల బాధతో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రం కాసర్లగడ్డకు చెందిన మారం తిరుపతిరెడ్డి (25) తన తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో చెరో రెండెకరాల్లో మిర్చి, జొన్న వేశాడు. మరో రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. వాతావరణం అనుకూలించక అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. పెట్టుబడి సొమ్ములు కూడా గిట్టుబాటు కావని తిరుపతి మనస్తాపం చెందాడు.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అతని పొలంలోనే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఎయిడ్‌‌‌‌‌‌‌‌ చేయించి మెరుగైన చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు అక్కడి నుంచి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరుపతిరెడ్డి ఆదివారం మరణించాడు. మృతుడి తండ్రి రాంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ముత్తారం ఎస్‌‌‌‌‌‌‌‌ఐ బేతి రాములు తెలిపారు. 

అప్పుల బాధతో మరోరైతు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఓల్డ్ ఇన్సిపేటకు చెందిన గడ్డం సుమన్ (28) తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరం భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. తామర తెగుళ్లు సోకి మిర్చి పంట దెబ్బతినగా, పత్తి పంట పూత లేక దిగుబడి రాలేదు.  పోయినేడాది వేసిన వరి పంట కూడా వరదల కారణంగా పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.8 లక్షలకు పెరిగాయి.

దీనికితోడు ఆరోగ్యం కూడా దెబ్బతింది. పంట దిగుబడి సరిగ్గా రాక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందిన సుమన్.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌‌‌‌‌‌‌‌ఐ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర సర్కారు అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.