సాధారణంగా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ దగ్గర వంట చేసేవాళ్లు ఎలా ఉంటారు? చెమటలు కక్కుతూ, కాస్త నలిగిపోయిన బట్టలతో కనిపిస్తారు. కానీ చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్, యాంతై నైట్ మార్కెట్‌కు వెళ్తే మాత్రం సీన్ అలగ్ ఉంటది. అక్కడొక 19 ఏళ్ల కుర్రాడు నీట్‌గా ఇన్ చేసిన సూట్, బూట్ వేసుకుని, హెయిర్ స్టైల్‌ను స్టైలిష్‌గా దువ్వి.. ఒక చేత్తో వెలిగించని సిగరెట్ నోట్లో పెట్టుకుని సెగలు కక్కే పొయ్యి దగ్గర ఫ్రైడ్ రైస్ వండుతుంటాడు. అతనే లూ. కేవలం వంట చేయడం మాత్రమే కాదు. తన లుక్, అదిరిపోయే స్టైల్ కుక్కింగ్ టెక్నిక్స్‌తో నైట్ మార్కెట్‌కే ఓ స్టార్ అట్రాక్షన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఇతని 'స్టైలిష్ ఫ్రైడ్ రైస్' వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి.
మొదట్లో రద్దీగా ఉండే మార్కెట్‌లో కాస్త డీసెంట్ గా కనిపించాలనే చిన్న ఆలోచనతో లూ సూట్ వేసుకోవడం ప్రారంభించాడు. కానీ ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. వంట చేసేటప్పుడు లూ ఇచ్చే చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్, కస్టమర్స్ విసిరే కోడిగుడ్లను గాల్లోనే క్యాచ్ పట్టి అల్లాడించడం వంటి చేష్టలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి. జపాన్ ప్రముఖ యానిమే సిరీస్ ‘వన్ పీస్’లోని ఫేమస్ క్యారెక్టర్ సాంజి అనే వంటవాడిని లూ పోలి ఉండటంతో.. నెటిజన్లు ఇతనికి "sanjifriedrice" అనే ట్యాగ్ ఇచ్చారు. దీంతో లూ సోషల్ మీడియా అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రే 46 వేలు దాటిపోయింది. కేవలం వీడియోలు చూసి, ఇతని స్టైల్ నచ్చి వందలాది మంది కస్టమర్లు ఇక్కడికి క్యూ కడుతున్నారు.
ఈ పాపులారిటీ వెనుక లూ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు ఎలాంటి విరామం లేకుండా లూ శ్రమిస్తాడు. కేవలం 3 నిమిషాల్లోనే ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్ సిద్ధం చేసే లూ.. రోజుకు 200 ప్లేట్లకు పైగా అమ్ముతాడు. ఇక్కడ ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్ ధర 10 యువాన్లు సుమారు రూ. 141. ఈ వ్యాపారంలో లూ తండ్రి కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రస్తుతం ఈ స్టాల్ ద్వారా నెలకు ఏకంగా రూ.7 లక్షలు టర్నోవర్ జరుగుతోంది. అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ.3 లక్షల వరకూ నికర లాభం మిగులుతోందని లూ చెబుతున్నాడు.
"నేను కేవలం ఈ బిజీ లైఫ్‌లోకి కొంచెం ఫ్యాషన్, రొమాన్స్ తీసుకురావడానికే సూట్ వేసుకున్నాను. జనాలు మొదట నా స్టైల్ చూసి ఇక్కడికి రావచ్చు, కానీ వాళ్లు పదే పదే రావడానికి మాత్రం నా చేతి వంట రుచే కారణం" అంటూ లూ గర్వంగా చెబుతున్నాడు. చిన్న వయసులోనే ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ బండిని తన వినూత్న ఆలోచనతో, కష్టపడే తత్వంతో ఒక బ్రాండ్‌గా మార్చిన లూ బిజినెస్ స్టోరీ నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఇతని దగ్గర వంటతో పాటు ఈ ప్రెజెంటేషన్ స్టైల్ నేర్చుకోవడానికి కుర్రోళ్లు అప్రెంటిస్‌లుగా చేరుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది చైనాలో.
