శుక్రమూఢమి కారణంగా ఏకంగా 83 రోజుల పాటు పెళ్లి వేడుకలు బంద్ కానున్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు చేసుకొవద్దని పండితులు చెబుతున్నారు. నవంబర్ 26 నుంచి శుక్రమూఢమి ప్రారంభమైంది.
కొన్నిరోజులుగా దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సందడి. ఎక్కడి చూసిన కళ్యాణ మండపాలన్ని కళకళలాడాయి. డెకరేషన్, ఫొటోగ్రాఫర్స్, కేటరింగ్, పూజారులు, కళ్యాణమండపాల్లో సందడితో హడావిడి కనిపించింది. ఇప్పుడు అంతా సైలెంట్. మరో మూడు నెలలు పెళ్లిళ్లకు బ్రేక్. శుక్ర మూఢమి వచ్చేసింది. 2025, నవంబర్ 26 నుంచి 2026, ఫిబ్రవరి 17వ తేదీ వరకు మూఢమి ఉంది. ఈ మూడు నెలలు పెళ్లిళ్లు లేవు. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఏమీ ఉండవు.
హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో శుభకార్యాలను నిర్వహించుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు. కొన్ని మౌడ్య రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని..అలా చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ( 2025) నవంబర్ 26 నుంచి శుక్ర మౌడ్యమి కాలం ప్రారంభమైంది. ఈ మౌఢ్యమి 2026 ఫిబ్రవరి 17 వరకు ఉంటుందని ( శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు) పండితులు చెబుతున్నారు. 83 రోజులు శుక్ర మౌడ్యమి కొనసాగుతుంది.
మౌడ్యమి అంటే శూన్యం అని అర్థం. అంటే మూఢం అని అంటారు. మూఢం ఉన్న రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఈ ఏడాది ( 2025) నవంబర్ 26 నుంచి వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరి 17 వరకు గురు, శుక్ర గ్రహాలు.. సూర్యుడికి అతి సమీపంలో ఉంటాయి. అందువలన ఈ రెండు గ్రహాలు బలహీనంగా మారిపోతాయి.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. శుభకార్యాలు నిర్వహించడానికి గురు బలం ఎక్కువగా ఉండాలి. అలాగే సంపద లేదా సంతోషంగా ఉండడానికి శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. ఈ రెండు గ్రహాల బలం తగ్గిపోవడంతో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని అంటున్నారు.
మూఢమిలో చేయకూడనివి
- వివాహాలు
- పెళ్లిచూపులు
- నిశ్చితార్థం
- గృహప్రవేశం
- శంకుస్థాపనలు
- దేవత విగ్రహ ప్రతిష్టలు
- కొత్త ఇల్లు కొనడం
- పుట్టు వెంట్రుకలు
- చెవులు కుట్టించడం
- కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం
- బోర్లు తవ్వించడం
- కొత్త ప్రయాణాలు
- తీర్థయాత్రలు
2026 ఫిబ్రవరి 17 తర్వాత వివాహాలు జోరుగా ఉండే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
ఇవి చేయవచ్చు
- సీమంతం
- అన్నప్రాసన
- నామకరణం
- హోమాలు
- నవగ్రహల శాంతులు
- నిత్యకర్మాది పూజాదికాలు
- చాతుర్మాస్య వ్రతాలు
ఈ కార్యక్రమాలను పండితులను సంప్రదించి తారా బలం ప్రకారం ముహూర్తంలో నిర్వహించుకోవచ్చు .. ఈ ఏడాది ( 2025) మార్చిలోనూ మూఢం రోజులు వచ్చాయి. మార్చి 13 నుంచి 25 వరకు మూఢం రోజులు రాగా.. ఈసారి 83 రోజులపాటు మూఢం రోజులు ఉండడంతో శుభకార్యాలు నిర్వహించుకునేవారు వాయిదాలు వేసుకుంటున్నారు. అలాగే గృహప్రవేశాలు చేసుకునే వారు సైతం తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు.
ఈరోజుల్లో నిత్య పూజలు.. ఇతర కార్యక్రమాలు యధావిధిగా జరుపుకోవాలని అంటున్నారు. మౌడ్యం రోజులు కేవలం కొత్త కార్యక్రమాలు లేదా కొత్త పనులు చేయడానికి మాత్రమే వర్తిస్తాయని.. అలాంటి వాటికి మాత్రమే దూరంగా ఉండాలని.. నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు.. పండుగలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. అయితే ఈ రోజుల్లో ప్రత్యేకంగా దైవారాధన చేయడం వల్ల కొన్ని ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం.. జ్యోతిష్య పండితుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
