T20 World Cup 2024: అతడొక మ్యాచ్ విన్నర్..ఒక్క కాలుతో నడిచినా సెలక్ట్ చేయాల్సిందే: భారత దిగ్గజ క్రికెటర్

T20 World Cup 2024: అతడొక మ్యాచ్ విన్నర్..ఒక్క కాలుతో నడిచినా సెలక్ట్ చేయాల్సిందే: భారత దిగ్గజ క్రికెటర్

రిషబ్ పంత్.. భారత టెస్టు క్రికెట్ లో బౌలర్లకు చుక్కలు చూపించాడు. టాప్ ప్లేయర్స్ ఫెయిల్ అయినా ఒక్కడే వారియర్ లా పోరాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. పిచ్ ఏదైనా, వేదిక ఏదైనా టెస్టు క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. పేస్, స్పిన్నర్లపై అటాకింగ్ చేస్తూ అత్యంత నిలకడ చూపించాడు. కానీ దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ యువ వికెట్ కీపర్ తాజాగా కోలుకోవడంతో అతన్ని టీ20 టోర్నీకి  ఎంపిక చేయాలని భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 

రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ అతడి అవసరాన్ని భారత క్రికెట్ కు తెలియజేశాడు. పంత్ ఒక గేమ్ ఛేంజర్ అని.. ఒక్క కాలితో ఫిట్​గా ఉన్నా అతడ్ని టీ20 వరల్డ్ కప్-2024లో ఆడించాలన్నాడు. నేనే సెలక్టర్ ను అయితే పంత్ ను ముందు సెలక్ట్ చేస్తా. ఒకవేళ అతడు అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం బెటర్. పంత్ అన్ని ఫార్మాట్ లలో కీలక ప్లేయర్ అని.. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పుతాడని గవాస్కర్ అన్నారు. రాహుల్ టీమ్​లో ఉంటే మంచి బ్యాలెన్స్ కూడా వస్తుంది. అతడ్ని ఓపెనర్​గా లేదా మిడిలార్డర్​లో 5, 6 స్థానాల్లో ఫినిషర్​గా వినియోగించుకోవచ్చు’ అని గవాస్కర్ తెలిపాడు. 

పంత్ 2022 డిసెంబర్ 30 న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలకు దూరమయ్యాడు. ఇటీవలే కోలుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిట్ నెస్ సాధించే పనిలో ఉన్నాడు. అప్పుడప్పుడు తాను జిమ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట షేర్ చేస్తున్నాడు. పంత్ 2024 ఐపీఎల్ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఐపీఎల్ లో రాణిస్తే వరల్డ్ కప్ లో చోటు దక్కినా ఆశ్చర్యం లేదు.