SRH vs MI: సన్ రైజర్స్ రికార్డుల మోత.. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్

SRH vs MI: సన్ రైజర్స్ రికార్డుల మోత.. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహకందని రీతిలో ఆడుతూ అభిమానులను దిల్ ఖుష్ చేసింది. వచ్చిన వారు వచ్చినట్టు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విధ్వంసం సృష్టించారు. హెడ్, అభిషేక్ శర్మ,క్లాసన్, మార్కరం  జూలు విదిల్చడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఎస్ఆర్ హెచ్.. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధాటికి తొలి 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. 24 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 62 పరుగులు చేసి హెడ్ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి అభిషేక్ శర్మ వంతు వచ్చింది. హెడ్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తే అభిషేక్ మాత్రం అంతకు మించి చెలరేగి 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 23బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఈ దశలో మార్కరం కు జత కలిసిన క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 55 బంతుల్లోనే 116 పరుగులు రాబట్టారు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసన్ మొత్తం 34 బంతుల్లో 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో మార్కరం 28 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో మఫాకా 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు.. కోయెట్జ్ నాలుగు ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు.