- 10 రన్స్ తేడాతో సీఎస్కేపై గెలుపు
- రాణించిన అభిషేక్, క్లాసెన్, ఈషాన్, నితీశ్
ఆల్‌రౌండర్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–19లో మూడో విజయం అందుకుంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రేక్ వేసింది. అభిషేక్ శర్మ (59), హెన్రిచ్ క్లాసెన్ (59) ఫిఫ్టీలకు తోడు బౌలింగ్‌లో ఈషాన్ మలింగ (3/29), నితీశ్ కుమార్ రెడ్డి (2/31) సత్తా చాటడంతో ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 10 రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించింది.
హైదరాబాద్, వెలుగు: సొంత అభిమానులు ప్రత్యర్థి జట్టుకు సపోర్ట్ ఇచ్చినా ఆల్‌రౌండర్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–19లో మూడో విజయం అందుకుంది. వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రేక్ వేసింది. అభిషేక్ శర్మ (22 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), హెన్రిచ్ క్లాసెన్ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) ఫిఫ్టీలకు తోడు బౌలింగ్‌లో ఈషాన్ మలింగ (3/29), నితీశ్ కుమార్ రెడ్డి (2/31) సత్తా చాటడంతో ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 10 రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించింది. టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత 20 ఓవర్లలో 194/9 స్కోరు చేసింది. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ (3/22), జేమీ ఓవర్టన్ (3/37) చెరో మూడు, ముకేశ్ చౌదరి (2/21) రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో చెన్నై 20 ఓవర్లలో 184/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. మాథ్యూ షార్ట్ (34), ఆయుష్ మాత్రే (30) కాస్త పోరాడారు. ఈషాన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అభి, క్లాసెన్ మెరుపులు
ఈ సీజన్‌లో సొంతగడ్డపై తొలిసారి హిట్టయిన అభిషేక్ శర్మతో పాటు హెన్రిచ్ క్లాసెన్ ఫిఫ్టీతో మెప్పించడంతో సన్‌రైజర్స్ మంచి స్కోరు చేసింది. తొలి ఓవర్లో స్పిన్నర్ మాథ్యూ షార్ట్ నాలుగు రన్సే ఇచ్చినా
తర్వాతి రెండు ఓవర్లో రెండు సిక్సర్లతో అభిషేక్ జోరు పెంచాడు. ఆపై అన్షుల్ కాంబోజ్‌కు హెడ్ (23) సిక్స్‌తో వెల్‌కం చెప్పగా.. అభి వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఇక్కడి నుంచి అభి టాప్ గేర్‌లోకి వచ్చాడు.
షార్ట్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించి 15 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ముకేశ్ వేసిన ఆరో ఓవర్లో హెడ్ మూడు ఫోర్లతో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. కానీ తర్వాతి రెండు బాల్స్‌కు హెడ్‌తో పాటు కెప్టెన్ ఇషాన్ (0) ను ఔట్ చేసిన ముకేశ్ రైజర్స్‌కు షాకిచ్చాడు. దాంతో పవర్ ప్లేను సన్‌రైజర్స్ 75/2తో ముగించింది.
ఫీల్డింగ్ మారిన తర్వాత చెన్నై బౌలర్లు రన్స్ నియంత్రించారు. శివం దూబే క్యాచ్ డ్రాప్ నుంచి తప్పించుకున్న అభి.. ఓవర్టన్ బౌలింగ్‌లో కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ టైమ్‌లో క్లాసెన్ నిలకడగా ఆడినా అనికేత్ (2), నితీశ్ రెడ్డి (12) ఫెయిలయ్యారు.
ఫోర్లు, సిక్సర్లు రాబట్టిన క్లాసెన్ 15 ఓవర్లకు స్కోరు 150 దాటించడంతో పాటు ఫిఫ్టీ (32 బాల్స్‌లో) పూర్తి చేసుకున్నాడు. కానీ, 18వ ఓవర్లో క్లాసెన్‌ను అన్షుల్ బౌల్డ్ చేయగా.. సలీల్ (13)ను గుర్జప్‌నీత్ సింగ్ వెనక్కుపంపాడు. చివర్లో శివాంగ్ (12) ఓ సిక్స్, ఫోర్ కొట్టినా.. లివింగ్‌స్టోన్ (5 బాల్స్‌లో1) హిట్ కాకపోవడంతో రైజర్స్ 200 మార్కును అందుకోలేకపోయింది.
దెబ్బకొట్టిన ఈషాన్, నితీశ్
ఛేజింగ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు తీసిన సన్‌రైజర్స్ బౌలర్లు చెన్నైని నిలువరించారు. గత మ్యాచ్ హీరో ప్రఫుల్ హింగే వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టిన చెన్నై డ్యాషింగ్ ఓపెనర్ శాంసన్ (7)ను తన తొలి బాల్‌కే ఔట్ చేసి నితీశ్ రెడ్డి షాకిచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆయుష్ మాత్రే.. హింగే వేసిన మూడో ఓవర్లో ఓ సిక్స్, నాలుగు ఫోర్లతో అలరించాడు. కానీ, ఐదో ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన నితీశ్.. క్లాసెన్ పట్టిన ఖతర్నాక్ క్యాచ్‌తో ఆయుష్‌ను పెవిలియన్ చేర్చాడు.
దాంతో రెండో వికెట్‌కు 51 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. నాలుగు ఫోర్లతో టచ్‌లో కనిపించిన కెప్టెన్ రుతురాజ్ (19)ను కాసేపటికే ఈషాన్ మలింగ ఔట్ చేయడంతో పవర్ ప్లేను సీఎస్కే 76/3తో ముగించింది. ఆ తర్వాత మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ (25) ముందుకు తీసుకెళ్లారు. స్పిన్నర్లతో పాటు పేసర్లను మెరుగ్గా ఎదుర్కొంటూ 9 ఓవర్లకే స్కోరు వంద దాటించారు.
ఈ దశలో రైజర్స్ బౌలర్లు గొప్పగాపుంజుకున్నారు. సర్ఫరాజ్‌ను ఈషాన్ ఔట్ చేయగా.. హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ (0)ను శివాంగ్ డకౌట్ చేశాడు. వరుసగా 4 ఓవర్లలో ఒక్క బౌండ్రీ లేకపోవడంతో సీఎస్కే 120/5తో డీలా పడింది. అయితే, ప్రఫుల్ బౌలింగ్‌లో శివం దూబే (21) సిక్స్, షార్ట్ ఫోర్ కొట్టి ఛేజ్‌కు మళ్లీ ఊపు తెచ్చారు. కానీ, రైజర్స్ పట్టువిడవలేదు.
16వ ఓవర్లో షార్ట్‌ను ఈషాన్ ఔట్ చేసి కీలక బ్రేక్ ఇవ్వగా.. ఆ వెంటనే దూబేను సాకిబ్ హుస్సేన్ అద్భుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ హైదరాబాద్ చేతుల్లోకి వచ్చేసింది. చివరి ఓవర్లో సీఎస్కేకు 18 రన్స్ అవసరం అవగా.. ఓవర్టన్ (16) వికెట్ తీసిన హింగే 7 రన్స్ మాత్రమే ఇవ్వడంతో రైజర్స్‌నే విజయం వరించింది.
సంక్షిప్త స్కోర్లు
- సన్‌రైజర్స్: 20 ఓవర్లలో 194/9 (అభిషేక్ 59, క్లాసెన్ 59, అన్షుల్ 3/22, ఓవర్టన్ 3/37).
- చెన్నై: 20 ఓవర్లలో 184/8 ( మాథ్యూ షార్ట్ 34, ఆయుష్ 30,ఈషాన్ మలింగ 3/29, నితీశ్ 2/31)
ఆరెంజ్ అడ్డాలో ఎల్లో ఫ్యాన్స్ హంగామా
ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అటెండ్ అయిన ఫ్యాన్స్ తమ హోమ్ టీమ్ సన్‌రైజర్స్‌కు కాకుండా సీఎస్కేకు సపోర్ట్ ఇచ్చారు. దాదాపు 36 వేల ఫ్యాన్స్‌తో స్టేడియం నిండిపోగా.. 80 శాతం మంది ఎల్లో జెర్సీలో కనిపించారు. ఆ టీమ్ లెజెండ్ ధోనీ కోసం కేరింతలు పెట్టారు. కానీ, మహీ గ్రౌండ్ కు రాకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సన్‌రైజర్స్ జెండాతో ఆ టీమ్‌ను ఉత్సాహపరిచింది.
* ఐపీఎల్‌లో వేగంగా 2 వేల రన్స్ పూర్తి చేసిన రెండో బ్యాటర్ అభిషేక్ (1193 బాల్స్‌లో). ఆండ్రీ రస్సెల్ (1120 బాల్స్) ముందున్నాడు.

