RCB vs SRH: కార్తీక్ అసాధారణ పోరాటం వృధా.. సన్ రైజర్స్ ఖాతాలో మరో విజయం

RCB vs SRH: కార్తీక్ అసాధారణ పోరాటం వృధా.. సన్ రైజర్స్ ఖాతాలో మరో విజయం

ఐపీఎల్ లో సన్ రైజర్స్ మరోసారి విశ్వ రూపం చూపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పంజా విసురుతూ భారీ విజయాన్ని అందుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో దినేష్ కార్తీక్(35 బంతుల్లో 83, 5 ఫోర్లు, 7 సిక్సులు) డుప్లెసిస్ పోరాడినా.. బెంగళూరు 262 పరుగులకు పరిమితమైంది. 

288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు డుప్లెసిస్(62, 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులు) విరాట్ కోహ్లీ(42, 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 6.2 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. జోరు మీదున్న కోహ్లీ భారీ షాట్ కు ప్రయత్నించి 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక్కడ నుంచి ఆర్సీబీ లక్ష్య ఛేదనలో వెనకపడింది. విల్ జాక్స్(7) దురదృష్టవరీతిలో రనౌట్ కావడం.. ఆ తర్వాత వెంటనే పటిదార్(9), హాఫ్ సెంచరీ చేసిన డుప్లెసిస్ తో పాటు సౌరవ్ చాహన్ డకౌట్ కావడంతో ఆర్సీబీ 122 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా అడుగులేసింది. అయితే ఎప్పటిలాగే దినేష్ కార్తీక్ తన మార్క్ చూపించాడు.
 
ఎడా పెడా బౌండరీలు బాదుతూ 23 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. గెలిపించడానికి విశ్వప్రయత్నం చేసినా లక్ష్యం మరీ భారీగా ఉండడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. అంతకముందు హెడ్(41 బంతుల్లో 102, 9 ఫోర్లు, 8 సిక్సులు) ఊచకోత సెంచరీకి తోడు క్లాసన్(67, 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులు) మెరుపు హాఫ్ సెంచరీతో  సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగులు చేసింది.