కోనరావుపేట,వెలుగు: వడదెబ్బతో ఓ మహిళా రైతు మృతిచెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన కొలకాని భూదవ్వ(68), ముత్తయ్య దంపతులు స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భూదవ్వ శుక్రవారం ధాన్యాన్ని ఆరబోసి పొలం పనులు చేసి సాయంత్రం ఇంటికి వచ్చాక అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆర్ఎంపీతో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి హాస్పిటల్కు తరలించే లోపే భూదవ్వ చనిపోయింది. మృతురాలికి భర్త, కొడుకు, కూతురు ఉన్నారు.
శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేటలో వడదెబ్బతో బొట్టు నర్సింలు(58) అనే రైతు మృతి చెందాడు. శనివారం ప్రైవేటు కాంటాకు వడ్లను విక్రయించి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు టీవీఎస్ ఎక్సెల్ బండిపై కవర్ కప్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వడదెబ్బతో అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.
