ఎల్‌నినోపై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అది నార్మల్ ఎఫెక్టేనని చెబుతున్నారు.జులై లేదా సెప్టెంబర్ నాటికి పసిఫిక్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగి సూపర్ ఎల్‌నినో పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఈ సారి వచ్చే ఎల్‌నినో ఏడాదిపాటు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో వచ్చిన అత్యంత తీవ్రమైన సూపర్ఎల్నినోల్లో ఇప్పుడు వచ్చే సూపర్ఎల్నినో నిలుస్తుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో 0.5 నుంచి 1 డిగ్రీల వరకు పెరిగితే నార్మల్ ఎల్‌నినో, 1 నుంచి 2 డిగ్రీలలోపు ఉంటే మోడరేట్ ఎల్‌నినో, 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగితే సూపర్ ఎల్‌నినో అని సైంటిస్టులు చెబుతున్నారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు కాటకాల ముప్పు తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు 1876/1877లో వచ్చిన సూపర్ఎల్నినోతో ప్రపంచ వ్యాప్తంగా కరువు విలయ తాండవం చేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక.. తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అది ప్రపంచ జనాభాలో 4 శాతం కావడం గమనార్హం. ఒక్క మనదేశంలోనే 96 లక్షల మంది దాకా కరువు కాటకాలతో బక్కచిక్కి బొక్కలు ఎండిపోయి ప్రాణాలు కోల్పోయారు.
బాంబే, మైసూరు, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్స్‌లలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి.. పంటలు సరిగ్గా పండలేదు. ఆ ఎఫెక్ట్ దేశమంతటా పడింది. తీవ్రమైన కరువు సంభవించింది. ఆ కరువును ‘మద్రాస్ ఫెమైన్’ (మద్రాస్ మహాకరువు) అనే పేరు కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది మంది రైతులు, నేత కార్మికులంతా కూలీ పనులు చేసుకునేందుకు ఉత్తరాదికి వలస వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడానికి కూడా ఈ కరువు కారణమైందంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత జనాభా వృద్ధి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో పడిపోయింది.
1881లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో ఈ విషయం తేలింది. అప్పుడు వచ్చిన సూపర్ ఎలినినోతో.. పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల దాకా పెరిగినట్టు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంతోపాటు చైనా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నది. సూపర్ ఎల్‌నినో, కరువు ఫలితంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లో దాని ప్రభావం ఉన్నదంటే అది ఎంత తీవ్రమైన కరువో అర్థం చేసుకోవచ్చు. 1982, 1997, 2015లలోనూ తీవ్రమైన ఎల్నినోలు వచ్చినా అంతటి ప్రభావం లేదు. ఇప్పుడు వచ్చే ఎల్‌నినో 1877 నాటి సూపర్ఎల్నినో అంతటి తీవ్రంగా ఉంటుందేమోనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే జరిగితే ఇప్పటికే ప్రపంచ యుద్ధాలతో అతలాకుతలమైతున్న ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ మార్కెట్లు.. మరింత పతనమ్యే ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరదలు రాక ప్రపంచ వాణిజ్యం కూడా పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు 2023 – 24లో వరదలు లేక పనామా కాలువలో నీటి మట్టాలు పడిపోయాయి. అప్పుడు నౌకల రవాణా తగ్గి ప్రపంచంలోని పలు దేశాలకు ట్రేడ్ పడిపోయింది. ఇటు ఉష్ణోగ్రతలు పెరిగి కార్చిచ్చుల ఘటనలు పెరుగుతాయి. మూగజీవాలకూ ఇబ్బందులు వస్తాయి.
తెలంగాణపై ప్రభావం ఎంత ?
ఎల్‌నినోతో తెలంగాణలోనూ పరిస్థితులు కష్టంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన ఔట్‌లుక్‌లో జులై నాటికి ఎల్‌నినో బలపడుతుందని పేర్కొన్నారు. అయితే, అది జూన్ నాటికే రావొచ్చని చెబుతున్నారు. 92 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా.. అంతకన్నా 5 శాతం తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేలోనే ఎల్‌నినో వచ్చే అవకాశాలున్నాయన్న డబ్ల్యూఎంవో అంచనాల నేపథ్యంలో.. వాతావరణ పరిస్థితులపై క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నారు. ఎల్‌నినో త్వరగా ఎంటరైతే రాష్ట్రంపై ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంలో వర్షాధార పంటలేవీ లేన్నప్పటికీ నదీ జలాలపైనే ఆధారపడ్డాం కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
మహారాష్ట్ర, కర్నాటకలకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. అదే జరిగితే వెస్టర్న్ ఘాట్స్ (పశ్చిమ కనుమలు)లో వర్షాలు పడక.. కృష్ణా, గోదావరి నదులకు వరదలు చాలా వరకు తగ్గుతాయని ఐఎండీ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఫలితంగా మన దగ్గర ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉండక.. ఇరిగేషన్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
దీంతో నదీ జలాలపైనే ఆధారపడుతున్న మన రాష్ట్రానికి అది గట్టి దెబ్బ అని విశ్లేషిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంటుందని, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యస్థంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి దక్షిణాది జిల్లాలకు పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదని చెబుతున్నారు. మే రెండో వారంలో ఇచ్చే వెదర్ ఎస్టిమేట్స్‌లో దీనిపై క్లారిటీ వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

