బాక్సీఫీస్ వద్ద మూవీ బాగుంటేనే థియేటర్లకు జనం వస్తారు అనేది పాత మాట. ఒక వ్యక్తంపై ఉన్న ఆరాధన అన్ని అంచనాలను తలకిందులు చేస్తుందని ' మైఖేల్ ' బయోపిక్ నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల గుండెల్లో కింగ్ ఆఫ్ పాప్ గా నిలిచిపోయిన మైఖేల్ జాక్సన్ జీవితం వెండితెరపై ఆవిష్కృతమైంది. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో జాక్సన్ అన్న కొడుకు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో పోషించారు. ఏప్రిల్ 24న విడుదలైన ఈ చిత్రం విమర్శకులు, సినీ ప్రియుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, వసూళ్లలో మాత్రం రికార్డుల సృష్టిస్తోంది.
మూడు రోజుల్లోనే రూ. 2వేల కోట్లు!
కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా గ్లోబల్ వైడ్ సుమారు రూ. 2049 కోట్లు వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. గతంలో బయోపిక్ కేటగిరీలో 'ఓపెన్ హైమర్' పేరిట ఉన్న రికార్డులను ఇది బద్దలు కొట్టింది. ఉత్తర అమెరికాలోనే దాదాపు 97 మిలియన్ల డాలర్లు రాబట్టి 100 మిలియన్ల డాలర్ల మార్కుకు చేరువలో ఉంది.
దిగ్గజ సినిమాల రికార్డులు కనుమరుగు
బయోపిక్ చరిత్రలో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలను 'మైఖేల్' వెనక్కి నెట్టేసింది. ఓపెన్ హైమర్ మూవీ 82.5 మిలియన్ల డాలర్ల ఓపెనింగ్స్ సాధించింది. బోహేమియన్ రాప్సోడి51 మిలియన్లు డాలర్లు, స్ట్రెయిట్ ఔటా కాంప్టన్ సినిమా $60.2 మిలియన్లు. ఈ చిత్రాలన్నింటినీ దాటుకుంటూ మైఖేల్ ప్రభంజనం కొనసాగుతోంది.
భారత్‌లోనూ అదే జోరు
భారతదేశంలో కూడా మైఖేల్ జాక్సన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొదటి రోజు రూ. 3.70 కోట్లతో మొదలైన వసూళ్లు, ఆదివారం నాటికి రూ. 5.50 కోట్లకు పెరిగాయి. పెయిడ్ ప్రివ్యూలతో కలిపి భారత్‌లో మొదటి వీకెండ్ నాటికి రూ. 19.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అదే సమయంలో విడుదలైన బాలీవుడ్ చిత్రాల కంటే ఇది మెరుగైన ప్రదర్శనను నమోదు చేసుకుంది.
అభిమానం గెలిచింది..
సినిమాలో కేవలం పాజిటివ్ అంశాలనే చూపించారని, వివాదాలను ముట్టుకోలేదని కొందరు పెదవి విరిచారు. అయినప్పటికీ, మైఖేల్ జాక్సన్ డ్యాన్స్, స్టైల్, ఆయన పర్సనాలిటీని వెండితెరపై చూడాలని అభిమానులు ఎగబడుతున్నారు. జాఫర్ జాక్సన్ తన మేనమామ మేనరిజమ్స్‌ను అద్భుతంగా పండించడం సినిమాకు ప్లస్ అయ్యింది. కథను మధ్యలోనే ఆపి, సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో రెండో భాగంపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. మొత్తానికి, విమర్శల కంటే 'లెజెండ్'పై ఉన్న ప్రేమే బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది.

