సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్:ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరగనున్న హీట్..సెప్టెంబర్ నుంచి2 027 ఫిబ్రవరి వరకూ తీవ్ర ముప్పు

 సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్:ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరగనున్న హీట్..సెప్టెంబర్ నుంచి2 027  ఫిబ్రవరి  వరకూ తీవ్ర ముప్పు
  •  సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినోతో  4.5 లక్షల మరణాలు! 
  • ఏటా ఎండల వల్ల సంభవించే మరణాలకు అదనంగా డెత్స్ 
  • భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15,800 మంది చనిపోయే ప్రమాదం 
  • క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక 

న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ సమీప ప్రాంతాల్లో ఏర్పడిన సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఎండల వేడిమి విపరీతంగా పెరగనుందని, లక్షలాది మంది చనిపోయే ప్రమాదం ఉందని రీసెర్చర్లు హెచ్చరించారు. 

ఏటా ఎండల తీవ్రత కారణంగా సంభవించే మరణాలకు అదనంగా ఈసారి 4,51,000 మంది మరణించే ముప్పు ఉందని ‘క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్’ రీసెర్చ్ సంస్థ నిపుణులు అంచనా వేశారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు15,800 అదనపు మరణాలు సంభవించవచ్చని తెలిపారు. 

ఈ మేరకు సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో కారణంగా ఆయా ప్రాంతాలపై పడే ప్రభావం, సంభవించే అదనపు మరణాలను అంచనా వేస్తూ వీరు ఒక నివేదికను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు, కమ్యూనిటీలను వాతావరణ మార్పులు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్ అధ్యయనం చేస్తుంది.

 ప్రస్తుత నివేదిక తయారీ కోసం..1996 నుంచి 2025 వరకు ఆయా దేశాల్లో ఏటా ఎండల తీవ్రత వల్ల సంభవించే యావరేజ్ మరణాలను పరిశీలించారు. తర్వాత సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఈ యావరేజ్ మరణాలకు అదనంగా ఎన్ని మరణాలు సంభవించవచ్చన్నది అంచనా వేశారు. 

గ్లోబల్ సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ ప్రాణనష్టం

సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం గ్లోబల్ సౌత్ దేశాల్లోనే అత్యధికంగా ఉంటుందని, ఈ దేశాల్లోనే అత్యధికంగా అదనపు డెత్స్ నమోదు కావచ్చని రీసెర్చర్లు పేర్కొన్నారు. ఒక్క సహేల్(సహారా ఎడారి దిగువ) ప్రాంతంలోనే 66,800 అదనపు ఉష్ణోగ్రత సంబంధిత మరణాలు సంభవించవచ్చని అంచనా వేశారు. 

ఆ తర్వాత నైజీరియాలో 31,400, సూడాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17,500, నైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10,000, చాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8,000 అదనపు డెత్స్ నమోదు కావచ్చని తెలిపారు. అలాగే, ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్, కంబోడియా దేశాల్లో కలిసి19,400.. ఇండోనేషియాలో 19,300 అదనపు మరణాలు సంభవించవచ్చు. వీటి తర్వాత భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15,800.. బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13,300 అదనపు డెత్స్ నమోదు కావచ్చని తెలిపారు. 

భారత్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఫిబ్రవరి తర్వాత వేసవి వరకూ ఉష్ణోగ్రత సంబంధిత మరణాలు కొనసాగుతూనే ఉండొచ్చని అంచనా వేశారు.  ప్రభుత్వాలు ముందుగానే అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి.. టెంపరేచర్ వార్నింగ్స్, కూలింగ్ సెంటర్లు, తాగునీటి సౌకర్యాలు, బయట పనిచేసే కార్మికులకు రక్షణ, వైద్య సదుపాయాల బలోపేతం వంటి చర్యలు చేపట్టేందుకు తమ అంచనాలు సహాయపడతాయని ‘క్లైమెట్ ఇంపాక్ట్ ల్యాబ్’ పేర్కొంది. 

ఎల్ నినో ముప్పు 2027కూ పొడిగింపు

 ఎల్ నినో ఇంకా దాని గరిష్ట స్థాయికి చేరుకోలేదని.. అది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ఈ నెల 3న తెలిపింది. నవంబర్ నుంచి -డిసెంబర్ మధ్య ఇది గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని వెల్లడించింది. 

ఇది 2027 ఫిబ్రవరి వరకూ కొనసాగే అవకాశం దాదాపు 100 శాతం ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) ఇటీవలి అంచనా ప్రకారం.. పసిఫిక్ సముద్రం మధ్య ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే1.8 డిగ్రీ సెంటీగ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా ఉన్నాయి. తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో 3 డిగ్రీలకు మించిన వ్యత్యాసాలు కనిపించాయి. అందుకే ఈ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో బలపడే అవకాశం 90 శాతంపైగా ఉందని ఆ సంస్థ తెలిపింది.