సింగరేణిలో మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ.. కాంపిటీషన్స్లో పాల్గొన్న పది జట్లు

సింగరేణిలో మైన్స్ రెస్క్యూ పోటీలు షురూ.. కాంపిటీషన్స్లో పాల్గొన్న పది జట్లు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థలో రెండు రోజుల పాటు జరగనున్న 55వ జోనల్ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. సింగరేణి ఆర్జీ-2 ఏరియా యైటింక్లయిన్ కాలనీలోని రెస్క్యూ స్టేషన్‌‌లో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(సదరన్ రీజియన్) డాక్టర్ సాగేష్ కుమార్, సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఆర్జీ-2, ఏఎల్పీ, ఆర్జీ-1, భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కొత్తగూడెం, మణుగూరు జట్లతో పాటు రెండు మహిళా జట్లు, యూసీఐఎల్, హెచ్‌‌జీఎంఎల్‌‌ నుంచి రెండు జట్లు కలిపి మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఇందులో ప్రతిభ చాటిన సభ్యులను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు రాంచీ, జార్ఖండ్‌‌లోని సెంట్రల్ కోల్‌‌ ఫీల్డ్స్(సీసీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

వివిధ విభాగాల్లో పోటీలు..
రెస్క్యూ, రికవరీ ఈవెంట్స్, ఫ్రెష్ ఎయిర్ బేస్ పోటీలను జీడీకే-7ఎల్‌‌ఈపీ మైన్‌‌ లోపల నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఫస్ట్ ఎయిడ్, స్టాట్యూటరీ, థియరీ పరీక్షలను యైటింక్లయిన్ కాలనీలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్‌‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి. సీతారామయ్య, ఐఎన్‌‌టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ నర్సింహులు, ఏరియా జనరల్ మేనేజర్ టి. లక్ష్మీపతి గౌడ్, రెస్క్యూ జీఎం కె. శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, కొత్తగూడెం సేఫ్టీ జీఎం కె.ఎం. తివారీ, ఆర్జీ రీజియన్ సేఫ్టీ జీఎం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.