తమ భాష మీద తమిళులకి ఉన్న అభిమానాన్ని దురభిమానం అనడానికి వీల్లేదు. వారికి తమ భాషపట్ల ఉన్నది వల్లమాలిన అభిమానం. తెలుగు ప్రజలు ఈ అభిమానాన్ని వారి నుంచి నేర్చుకోవాల్సిందే. హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు.
మంచికోసమే ఈ ప్రాధాన్యతని కేంద్రం ఇస్తోందని చెప్పడానికి ఆయన చాలా శ్రమపడ్డారు. భారతదేశంలో బహుభాషలు ఉన్నాయి. భారతీయ భాషల మధ్య సాన్నిహిత్య భావనని సృష్టించడానికి హిందీ అనుసంధాన భాష అని హోం మంత్రి అమిత్ షా వివరించారు.
ఇది జాతీయ సమైక్యతను బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందన్న వాదన ఉండనే ఉంది. ఈ భయాలు తమిళ ప్రజల్లోనే కాదు. దేశ ప్రజల్లో కూడా ఉన్నాయి.
ఈ విషయాలన్నీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన ఇలా అన్నారు. హిందీ ఏవిధంగానూ ప్రాంతీయ భాషలకు పోటీ కాదని, వాటిని పరిరక్షిస్తూ, ప్రోత్సహిస్తూ హిందీ కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన నొక్కి చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆచరణపై దేశ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చట్టాలకు హిందీ పేర్లు
రెండు సంవత్సరాల క్రితం భారతీయ సాక్ష్యాధారాల చట్టం, భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానాలలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకుని వచ్చింది. వాటి పేరు భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలు. ఈ పేర్లు పలకడానికి కఠినంగా ఉండటమే కాదు. చాలామంది భారతీయులకు అర్థం కూడా కావడం లేదన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
అయినాకూడా కేంద్ర ప్రభుత్వం హిందీ పేర్లనే శాసనాలకి పెడుతున్నారు. అంతేకాదు చట్టాలకి హిందీలో నామకరణం చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 (1) (ఎ)ని
విస్మరించడమే అవుతుంది. దాని స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలు కూడా ఉన్నాయి.
త్రిభాషా సూత్రం..
9, 10 తరగతుల విద్యార్థులకు రెండు భారతీయ భాషలను తప్పనిసరి చేయడం.. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై పరోక్షంగా హిందీని రుద్దడమే అని కొందరి భావన. అధికారిక లేఖలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హిందీలో ఫైళ్లని రాస్తే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా లేఖలు కూడా ఉంటున్నాయని వింటున్నాం. వాటిని స్వీకరించే అధికారి లేదా రాష్ట్రం ఆ భాషను ఉపయోగించకపోయినా హిందీలోనే రాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
హిందీ మాట్లాడని రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యునికి ఆంగ్ల అనువాదంలేకుండా హిందీలో లేఖలు వస్తున్నాయి. ఇది పరోక్షంగా హిందీని బలవంతంగా రుద్దడంగా భావిస్తున్నారు. ఇందువల్ల దేశ ఐక్యత కన్నా విభేదాలకు ఎక్కువగా దారితీసే అవకాశం ఉంది.
నవోదయ పాఠశాలల సవాలు
ఇది ఇలా ఉంటే ఇటీవల తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ, దానిచుట్టూ తిరుగుతున్న భాషా విధాన వివాదం మనదేశంలో సమాఖ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సున్నితమైన సవాళ్లని మరోసారి తెరపైకి తెచ్చాయి.
తమిళనాడులోని ప్రతి జిల్లాలో నవోదయ పాఠశాలల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జస్టిస్ వివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ముసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నవోదయ పాఠశాలలు అనుసరించే త్రిభాషా విధానాన్ని (ట్రయాంగిల్ పార్ములా) వ్యతిరేకిస్తున్న తమిళనాడును ఉద్దేశించి ‘తమిళనాడు గడ్డపై హిందీ బోధించకుండా ఉండటం కుదరదు. మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’ అని సుప్రీం న్యాయస్థానం స్పష్టం చేసింది.
కేంద్ర నిధులతో నడిచే ఈ పాఠశాలలు ఏర్పాటువల్ల తమిళనాడులోని విద్యా ప్రమాణాలు తగ్గవని, ఇవి అదనపు అవకాశాలను మాత్రమే కల్పిస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. చెన్నై, ఢిల్లీ ప్రజలు ఒకరికొకరు దూరం కాకూడదని పేర్కొంటూ, రాజ్యాంగ ఉమ్మడి జాబితాలో (కరెంట్ లిస్ట్) ఉన్న విద్య విషయంలో ‘సహకార సమాఖ్యవాదం’ (కోఆపరేటివ్ ఫెడరిలిజం) అత్యంత ఆవశ్యకమని కోర్టు గుర్తుచేసింది.
తమిళనాడు అభ్యంతరాలు, ఆందోళనలు
మరోవైపు, తమిళనాడు రాష్ట్రం తన సొంత విద్యా విధానాన్ని (ద్విభాషా సూత్రం - తమిళం, ఆంగ్లం)
పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానం ద్వారా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందన్నది రాష్ట్ర ప్రధాన ఆందోళన.కోర్టులో తమిళనాడు తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదిస్తూ-- తమకు పాఠశాలల ఏర్పాటుపై గానీ, విద్యార్థులు హిందీ నేర్చుకోవడంపైగానీ వ్యతిరేకత లేదని, అయితే నవోదయ పథకంలోని నిర్బంధ భాషా విధానం రాష్ట్ర విద్యా విధానానికి విరుద్ధమని స్పష్టం చేశారు.
ఇది తమిళ భాషా ప్రాధాన్యతను తగ్గించేలా ఉందనేది వారి ప్రధాన వాదన. అంతేకాకుండా, విద్య కోసం కేటాయించాల్సిన రూ. 5,000 కోట్ల నిధులను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని, ఆర్థిక లోటు ఉన్న సమయాన అదనపు భారాన్ని మోయడం కష్టమని రాష్ట్రం తెలిపింది.
ఒక ప్రాంత ప్రజల సాంస్కృతిక ముద్ర భాష
భాష అనేది కేవలం భావప్రకటనా సాధనం మాత్రమే కాదు. అది ఒక ప్రాంత ప్రజల సాంస్కృతిక ముద్ర, ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశం. ప్రజాస్వామ్యంలో ఏ భాషనైనా స్వేచ్ఛగా నేర్చుకునే హక్కు పౌరులకు ఉండాలి. సుప్రీంకోర్టు సూచించినట్లుగా, సమస్యలను పట్టుబట్టడం ద్వారా కాకుండా.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిర్మాణాత్మక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం బలవంతపు ఏకీకరణకు స్వస్తి చెప్పి, రాష్ట్రాల సాంస్కృతిక సున్నితత్వాన్ని గౌరవించాలి. అలాగే, రాష్ట్రాలు కూడా విద్యార్థులకు లభించే అదనపు విద్యావకాశాలను అడ్డుకోకుండా, చర్చల ద్వారా పరస్పర అంగీకారానికి రావడం నేటి అవసరం. పరస్పర గౌరవం, సహకార సమాఖ్య విధానమే భారత జాతీయ ఐక్యతకు అసలైన బలం. రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛా స్ఫూర్తి, వాక్ స్వాతంత్ర్యం అయినా లేదా మతం అయినా వైవిధ్యాన్ని గౌరవిస్తుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలు తాము కోరుకున్న భాషను నేర్చుకోవడానికి, మాట్లాడటానికి స్వేచ్ఛగా ఉండాలి. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య, భాషల మధ్య సమాచార మార్పిడి ఎప్పటినుంచో ఉన్నట్లుగా, సంభాషించాలనే సంకల్పం నుంచే ఉద్భవిస్తుంది. అనుసంధాన భాషగా ఇంగ్లిష్ ఇప్పటికే స్థిరమైంది. దాన్ని అస్థిరం చేయడం అసమంజసం. మనకి ఇష్టంవున్నా లేకున్నా అది అంతర్జాతీయ భాష.
- డా. మంగారి రాజేందర్,జిల్లా జడ్జి (రిటైర్డ్)
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
