మోరంపల్లి బంజర్లో గాలివాన బీభత్సం

మోరంపల్లి బంజర్లో గాలివాన బీభత్సం
  • గాలి దుమారంతో ఎగిరిపోయిన రేకులు, నేలకొరిగిన చెట్లు

బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్  మండలం మోరంపల్లి బంజర్​లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడగా, మోరంపల్లి బంజర్ సమీపంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రామంలోని ప్రధాన సెంటర్ లో టోర్నడో మాదిరిగా ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకొని గాలిదుమారం బీభత్సం సృష్టించింది.

కేవలం బస్టాండ్  సెంటర్ లోనే  నిమిషం పాటు వీచిన బలమైన గాలుల ధాటికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్​లు, తోపుడుబండ్లు సైతం రోడ్డుపైకి కొట్టుకువచ్చాయి. తోపుడు బండిపై అరటికాయలు అమ్ముకునే కృష్ణారెడ్ది బండితో పాటు కొంతదూరం కొట్టుకుపోవడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.

సడెన్​గా వీచిన గాలితో వ్యాపారులు, స్థానిక ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. రోడ్లపై నేలకూలిన చెట్లు, ఇతర వస్తువులతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గాలిదుమారంతో గ్రామంలో విద్యుత్  సరఫరా నిలిచిపోయింది.