మాజీ సైనికుల భూమి వారికే ఇవ్వాలె..గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

మాజీ సైనికుల భూమి వారికే ఇవ్వాలె..గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

హైదరాబాద్ ,వెలుగు: పఠాన్ చెరువు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో మాజీ సైనికులకు కేటాయించిన భూమిని రియల్ ఎస్టేట్ సంస్ధలు తమ పేరు మీదకు మార్చుకున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అన్నారు. ఈ అంశంపై బుధవారం గవర్నర్ శివపత్రాప్ శుక్లాకు లేఖ రాశారు. 

కొల్లూరు సర్వే నంబర్ 191లో 83 మంది మాజీ సైనికులకు ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున భూమిని కేటాయించారని పేర్కొన్నారు. ఏడుగురు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నకిలీ పత్రాలతో సుమారు 250 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, బిల్డర్లకు కేటాయించినట్లు ఎస్.కె.సిన్హా నివేదిక పేర్కొందన్నారు. 

దాదాపు 50 ఎకరాలు ప్రస్తుతం ఆక్రమణలో ఉండి, అక్కడ ఒక పెద్ద కాలనీ ఏర్పడిందన్నారు. సుమారు 200 ఎకరాలు భూమి ఇప్పటికీ ఖాళీగా ఉన్నప్పటికీ, రికార్డుల్లో పై పేర్కొన్న వ్యక్తులు/సంస్థల పేర్లపై యాజమాన్య హక్కులు ఉన్నాయన్నారు. గవర్నర్ జోక్యం చేసుకొని సైనికులకు భూమి కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.